ఈపీఎఫ్​ వేతన పరిమితి పెంపు?

ఈపీఎఫ్​ వేతన పరిమితి పెంపు?

 న్యూ ఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్​) గరిష్ఠ వేతన  పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.21వేలకు చేర్చనుందని ప్రచారం జరుగుతోంది.  కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ  గరిష్ఠ వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. 

అప్పట్లో రూ.6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు.  వేతన పరిమితి పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్‌ సమయానికి ఉద్యోగి ఈపీఎఫ్​ను పెంచుకోవచ్చు.