మెడికల్ కాలేజీకీ అంతా సిద్ధం.. సెప్టెంబర్ నుంచి తరగతులు

మెడికల్ కాలేజీకీ అంతా సిద్ధం.. సెప్టెంబర్ నుంచి తరగతులు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం గవర్నమెంట్ మెడికల్​ కాలేజీలో ఈ అకడమిక్​ఇయర్​ నుంచి తరగతులు  నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్​ నుంచి క్లాసులు స్టార్ట్ చేసుకునేందుకు శుAక్రవారం తుది అనుమతులు వచ్చాయి. 100 మెడికల్ సీట్లతో 2023 –24 నుంచే తరగతులు నిర్వహించేందుకు నేషనల్​ మెడికల్​కమిషన్​ పర్మిషన్​ లెటర్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం మెడికల్ కాలేజీకి కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్​ఆవరణలో సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, పంజాబ్​, కేరళ ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి పాత కలెక్టరేట్ భవనం, ఆర్అండ్ బీ బిల్డింగ్ కలుపుకొని మెడికల్ కాలేజీ కోసం అవసరమైన మార్పులు చేర్పులు, నిర్మాణాలు చేస్తున్నారు. ఖమ్మంలోని మెయిన్​రోడ్డుకు ఒకవైపు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతుండగా, అదే రోడ్డుకు మరోవైపు ఆస్పత్రి ఉండటంతో ఈ రెండింటి మధ్య ఫుట్ ఓవర్​బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. ట్రాఫిక్​ ఇబ్బంది లేకుండా రూ.3.25 కోట్లతో ఫుట్ ఓవర్​బ్రిడ్జి, లిఫ్ట్ నిర్మాణాలు చేయనున్నారు. 

కొనసాగుతున్న నిర్మాణాలు..

గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కోసం జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్లు కేటాయించింది. నగరంలోని పాత కలెక్టరేట్, ఆర్అండ్ బీ ఆఫీస్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న స్థలాలతో కలిపి మొత్తం 30 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీకి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయా బిల్డింగుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 

ఖమ్మం జిల్లా ప్రజల కల సాకారం: మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ 

ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీలో తరగతులు నిర్వహించేందుకు 100 సీట్లతో నేషనల్ ​మెడికల్ కమిషన్​ పర్మిషన్​ ఇవ్వడం ఆనందంగా ఉంది.