కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలివ్వని సర్కార్

కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలివ్వని సర్కార్

సర్కారీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నడుపుతున్నారు. రాష్ర్టంలో సర్కారీ జూనియర్‌‌ కాలేజీల్లో సమారు 3,800 మంది, డిగ్రీ కాలేజీల్లో 900 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. జూనియర్‌‌ కాలేజీ లెక్చరర్లకు రూ.37,100, డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు రూ.40,270 వేతనం అందుతోంది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి వేసవిలోనూ వీరికి వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఫిబ్రవరి నుంచి జూనియర్‌‌ లెక్చరర్లకు, మార్చి నుంచి డిగ్రీ లెక్చరర్లకు వేతనాలు అందడం లేదు. పెండింగ్‌‌ వేతనాలివ్వాలని ఇంటర్‌‌ బోర్డు, సెక్రటేరియెట్‌‌ చుట్టూ కాంట్రాక్టు లెక్చరర్లు ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌‌, మే, జూన్‌‌ నెలలకు లెక్చరర్ల వేతన బడ్జెట్‌‌ మంజూరైనట్టు అధికారులు ఉత్తర్వులిచ్చినా, జిల్లా ట్రెజరరీలకు ఆ నిధులు రాలేదని తెలుస్తోంది. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో లెక్చరర్ల కుటుంబాలు అప్పులతో కాలం గడుపుతున్నాయి. ఒకసారి వచ్చిన వేతనంలో వడ్డీలకే సగం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెజరరీతోనే సమస్య

సర్కారీ ఉద్యోగులందరూ 010 పద్దు కింద ఉండటంతో వారికి ప్రతినెల ఒకటో తారీఖునే వేతనాలు అందుతున్నాయి. కాంట్రాక్టు ఎంప్లాయీస్‌‌ ఆ పద్దు పరిధిలోకి రారు. ట్రెజరరీ అధికారులు డబ్బులున్నప్పుడే బిల్లులు తీసుకుని వేతనాలు విడుదల చేస్తున్నారు. దీంతో ఐదారు నెలలకోసారి వేతనాలు అందుతున్నాయి. ఇటీవల ఇదే సమస్య పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌‌లో తలెత్తితే, ట్రెజరరీ కంట్రోల్‌‌ను ఎత్తివేశారు. దీంతో ప్రతిశాఖ హెడ్‌‌ 25వ తేదీనే శాలరీ బిల్లులు పెట్టి, ట్రెజరరీకి పంపిస్తున్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున వేతనాలు అందుతున్నాయి. రాష్ట్రంలోనూ ఈ విధానం తీసుకురావాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు.