బడులు మొదలై నెలన్నరవుతున్నా స్కూల్ గ్రాంట్స్ ఇవ్వని ప్రభుత్వం

బడులు మొదలై నెలన్నరవుతున్నా స్కూల్ గ్రాంట్స్ ఇవ్వని ప్రభుత్వం
  • నిధుల కోసం హెచ్ఎంల ఎదురుచూపులు 
  • రిపేర్లకు సొంత డబ్బులు పెట్టిన హెడ్మాస్టర్లు
  • ఒక్కొక్కరు రూ.20 వేల నుంచి 75 వేలదాక ఖర్చు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లు నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటినా ప్రభుత్వం ఒక్క బడికీ పైసా ఇవ్వలేదు. దీంతో అప్పులు చేసి హెడ్మాస్టర్లు స్కూళ్లు నడుపుతున్నారు. మరో 20 రోజుల్లో పంద్రాగస్టు రానున్నది. కనీసం అప్పటి వరకైనా స్కూల్ గ్రాంట్స్ ఇస్తారో? లేదోనని హెడ్మాస్టర్లు, టీచర్లు ఆందోళనలో ఉన్నారు. బడుల నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఏటా గ్రాంట్స్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24,852 స్కూళ్లకు రూ.12,500 నుంచి లక్ష వరకు రెండు విడతల్లో నిధులు ఇవ్వాల్సి ఉంది. పోయిన నెల13న స్కూళ్లు రీపెన్ అయ్యాయి. అయినా ఇప్పటికీ నిధులు రిలీజ్ చేయలేదు. 
ఉన్న నిధులనూ తీసుకుంది.. 
గతంలో బడుల ఖాతాల్లో ఉన్న నిధులన్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో జూన్​లో ప్రభుత్వం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటకు హెడ్మాస్టర్లు, టీచర్లే ఖర్చు పెట్టారు. స్కూల్స్ రీఓపెన్ సమయంలో చిన్న చిన్న రిపేర్లు, క్లీనింగ్, ఇతర అవసరాలకూ వాళ్లే సొంతంగా ఖర్చు చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కో హెడ్మాస్టర్ రూ.20 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చు చేశారు. కొందరు సొంత డబ్బులు ఇవ్వగా, ఇంకొందరు అప్పు చేసి పనులు చేయించారు. ఇప్పటికే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ఇక పంద్రాగస్టు వరకు గ్రాంట్స్ ఇవ్వకపోతే మళ్లీ తామే రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని హెడ్మాస్టర్లు వాపోతున్నారు.  

ట్రాన్స్​ఫర్ అయితే ఎట్ల? 
ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్​లో ప్రమోషన్లు, బదిలీలపై చర్చ జరుగుతోంది. జూన్​లోనే టీచర్లు, హెడ్మాస్టర్ల ట్రాన్స్​ఫర్లు ఉంటాయని సర్కారు పెద్దలు ప్రకటించినా, పలు కారణాలతో ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఒకవేళ ట్రాన్స్​ఫర్లు జరిగి వేరే స్కూల్​కు బదిలీ అయితే, ప్రస్తుతం బడుల్లో పెట్టిన ఖర్చులు ఇస్తారో? లేదోనని హెడ్మాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ గ్రాంట్స్​వస్తే, అవన్నీ తీసుకున్నా.. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులకు సరిపోవని అంటున్నారు. స్కూల్​లో రూపాయి లేకుండా తీసుకుంటామంటే ఇస్తారో? లేదోనని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్కూల్ గ్రాంట్స్​ను పెంచి ఇవ్వాలని హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ డిమాండ్ చేశారు. హెడ్మాస్టర్లు సొంతంగా ఖర్చు చేస్తున్న విషయం తమకు తెలుసని... కానీ తామూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. సర్కారు బడ్జెట్​ రిలీజ్ చేస్తేనే స్కూళ్లకు నిధులు అందుతాయని చెబుతున్నారు.