పైసల్లేక అల్లాడుతున్న పంచాయతీలు

పైసల్లేక అల్లాడుతున్న పంచాయతీలు

ఇక్కడ డ్రైనేజీ తీస్తున్నది సఫాయి కార్మికుడు కాదు.. రాయికల్‍ మండలం మైతాపూర్‍ గ్రామ సర్పంచ్‍ అజారుద్దీన్‍. జీతాలివ్వకపోవటంతో పంచాయతీలో పనిచేసే కార్మికులు పని బంద్‍ చేశారు. దాంతో ఊరంతా చెత్త చెదారం నిండి కంపు కొడుతోంది. రోగాలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గ్రామ సర్పంచ్, మరికొందరు స్వయంగా డ్రైనేజీల్లో చెత్తను తొలగించారు.

వెలుగు నెట్ వర్క్:  పైసల్లేక పంచాయతీలు అల్లాడుతున్నాయి. అభివృద్ధి పనులేమోగానీ, మంచి నీళ్లు కూడా సరిగా సరఫరా కాని దుస్థితిలో ఊర్లు కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీటి బోర్లు కాలిపోతే రిపేర్​ చేయించేందుకు, కనీసం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసేందుకు, పాడైన స్ట్రీట్​ లైట్లను మార్చేందుకూ పైసల్లేని పరిస్థితి నెలకొంది. సిబ్బందికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవు. ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్తాచెదారం పేరుకుని, డ్రైనేజీలు పూడుకు పోయి కంపు కొడుతున్నాయి. గ్రామ పంచాయతీలకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. పల్లెల గల్లాపెట్టెలు కొద్ది నెలలుగా ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో అటు పైసల్లేక ఇటు పవర్​ లేక.. కొత్త సర్పంచులు దిక్కులు చూస్తున్నారు. ఓట్లేసిన జనానికి జవాబు చెప్పలేక కొందరు ముఖం చాటేయగా.. కొందరు అప్పో సొప్పో చేసి, విరాళాలు సేకరించి ఊర్లలో అత్యవసరమైన పనులు చేస్తున్నారు.

పైసలతోనే అసలు ‘పంచాయితీ’

ఫైనాన్స్​ కమిషన్ నిధులు, ఉపాధి హామీ నిధులు, సొంత ఆదాయ వనరులతో గ్రామ పంచాయతీల ఖజానా కళకళలాడాలి. ప్రతి ఏడాది రాష్ట్రంలోని పంచాయతీల ఖాతాల్లో రూ.8,000 కోట్ల నిధులు జమ కావాలి. కానీ గతేడాది జులై నుంచి పల్లెల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో రూ.1,628 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. అందులో భాగంగా గత జులైలో రూ.162 కోట్లు, ఈ ఏడాది మార్చిలో రూ.534 కోట్లు ఇచ్చింది. కేంద్రం వాటాకు తోడుగా రాష్ట్రం తన వంతు నిధులు కలిపి.. రెండు వారాల్లో పంచాయతీల ఖాతాలో వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం గడువు మీరితే.. వడ్డీతో సహా పంచాయతీలకు చెల్లించాలన్నది ఫైనాన్స్​ కమిషన్​ నిబంధన. కానీ ఇప్పటికీ ఆ నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ కాలేదు. ఇతర పథకాలకు వాడుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ సొమ్మును పీడీ (పర్సనల్​ డిపాజిట్) ఖాతాల్లో వేసింది. దాంతో పంచాయతీల పేరిట డబ్బులున్నట్టు కనిపించినా.. సర్పంచులు వాటిని వాడుకోలేని దుస్థితి. సర్పంచులు చెక్కులిచ్చినా అవి క్లియర్​ అయ్యేందుకు నెలల తరబడి ట్రెజరీలో ఆగిపోతాయి.

దీంతో గత జులై నుంచి పంచాయతీలకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త సర్పంచులకు 4 నెలలుగా చెక్​ పవర్​ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయటంతో పంచాయతీల డొల్లతనం బయటపడింది. పైసల్లేక పల్లెలు అల్లాడుతున్న పరిస్థితి పంచాయతీరాజ్​ పనితీరును వేలెత్తి చూపుతోంది.‘గ్రామాలకు నేరుగా నిధులిస్తాం. ఆర్థిక సంఘం, నరేగా నిధులు, రాష్ట్రం తరఫున పంచాయతీకి జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తాం..’అని ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరుస ఎన్నికల కోడ్, బడ్జెట్​లో దీని ప్రస్తావన లేకపోవటంతో సీఎం హామీ అమలవుతుందా, లేదా అన్న అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి.

ఆగస్టు నుంచి మరింతగా..

గతేడాది ఆగస్టు నుంచి గ్రామాలన్నీ స్పెషలాఫీసర్ల పాలనలో ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో గతేడాది అక్టోబర్​ నుంచి ఎలక్షన్​ కోడ్​ అమల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి రావటంతో గ్రామాల బాగోగులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఫిబ్రవరి 2వ తేదీన బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచులకు ఈ సమస్యలన్నీ స్వాగతం పలికాయి. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో అయితే పాలన మరింత అధ్వానంగా ఉంది.