రూ. 2.38 లక్షల కోట్ల రక్షణ శాఖ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రూ. 2.38 లక్షల కోట్ల రక్షణ శాఖ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకు కొత్త వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్‎లు, మిలటరీ హార్డ్‎వేర్‎ను కొనుగోలు చేసే రూ. 2.38 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ సేకరణ మండలి (డీఏసీ) శుక్రవారం (మార్చి 27) ఆమోదం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 

ఈ నిధులతో ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరిన్నీ యూనిట్లు, సుఖోయ్ ఎస్‌యు-30 ఏరో ఇంజిన్ భాగాలు, ఏఎన్32, ఐఎల్76 రవాణా విమానాల స్థానంలో మధ్య తరహా రవాణా విమానాలు, ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మర్డ్ పియర్సింగ్ ట్యాంక్ ఆమ్మోనిషన్, హై కెపాసిటీ రేడియో రిలే, ధనుష్ గన్ సిస్టమ్, రన్‌వే ఇండిపెండెంట్ ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్‌ వంటి ఆయుధాలు సేకరించనున్నారు.

ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.  ‘‘శుక్రవారం (మార్చి 27) తన అధ్యక్షతన జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీ) సమావేశంలో సుమారు రూ. 2.38 లక్షల కోట్ల అంచనా వ్యయం గల వివిధ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. డీఏసీలో తీసుకున్న నిర్ణయాలు భారతదేశ రక్షణ సన్నద్ధతను మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి” అని పేర్కొన్నారు.