సీఎంఆర్‌‌ ఆలస్యంతో సర్కారు కొరడా

సీఎంఆర్‌‌ ఆలస్యంతో సర్కారు కొరడా
  • వచ్చే సీజన్‌‌ నుంచి ఇవ్వొద్దని సూత్రప్రాయంగా నిర్ణయం!
  • మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక మిల్లులకు ఇచ్చే యోచన 
  •  ఎఫ్​సీఐ అనుమతి కోరిన సివిల్ సప్లయ్స్ శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: ఏండ్ల తరబడి మిల్లింగ్‌‌ లో జాప్యం చేస్తున్న మిల్లర్లకు సర్కారు చెక్‌‌ పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మిల్లర్ల ఆగడాలు హెచ్చుమీరిపోతున్న నేపథ్యంలో కొరడా ఝళిపించాలని నిర్ణయించింది. ఈ వానాకాలం వరి సాగు పెరగడంతో భారీగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కేంద్రానికి సకాలంలో సీఎంఆర్‌‌ ఇవ్వాలంటే రాష్ట్రంలో మిల్లర్లను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్‌‌కు ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ధాన్యం మిల్లింగ్‌‌ కోసం మహారాష్ట్ర, ఏపీ,  కర్ణాటక తదితర రాష్ట్రాల మిల్లర్లను ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎఫ్‌‌సీఐకి దీనిపై సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు సమాచారం. సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌తో ఆదివారం జరిగిన భేటీలో కమిషనర్‌‌ అనిల్‌‌ కుమార్‌‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోమవారం మిల్లర్లతో సమావేశం నిర్వహించి ఈ హెచ్చరికలు చేయనున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి సర్కారు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు ఇవ్వకుండా మిడ్‌‌ పాయింట్‌‌లో ఉంచి సర్కారు ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని  సమాచారం. రెండేండ్లుగా మిల్లర్లు సీఎంఆర్‌‌ ను జాప్యం చేయడంతో పాటు 2 లక్షల టన్నులకు పైగా బియ్యం ఎగవేతకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. ఈయేడు మరింత దిగుబడి పెరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మిల్లర్లను నమ్ముకుంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు సీఎంఆర్‌‌పై కేంద్రం గడువు పొడిగించడానికి సిద్ధంగా లేకపోవడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆలోచన చేస్తోంది.