
హైదరాబాద్, వెలుగు: అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అభ్యంతరాలు లేని 69 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును కోరింది. అయితే అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, దాన్ని యథాతథంగా కొనసాగించి ఎన్నికలకు అనుమతించాలని కోరింది. ప్రక్రియ సిద్ధం చేశాక డ్రాఫ్ట్ విడుదల చేసి అభ్యంతరాల్ని స్వీకరించామని, వాటిని పరిష్కరించిన తర్వాత చట్ట విరుద్ధమైన అంశాల జోలికి వెళ్లలేదని తెలిపింది. వివిధ మున్సిపాలిటీల విషయంలో ఇచ్చిన స్టేలు, ఎన్నికల ప్రక్రియ సజావుగా లేదని అంజ్ కుమార్ రెడ్డి వేసిన పిల్‌ను కొట్టేసి ఎన్నికలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.