
- లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలోని జీఎస్టీ మండలి స్లాబుల్లో మార్పులు తేవడంతో చాలా నిత్యావసరాలు చవక కానున్నాయి. అనేక రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారం తగ్గుతుంది. బీమా, చదువు కోసం వాడే వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. వీటి ధరలు భారీగా తగ్గుతాయి. అయితే పాన్ మసాలా, సిగరెట్లు, లగ్జరీ కార్లు వంటి సిన్ గూడ్స్, లగ్జరీ ఐటమ్స్‌పై భారీగా పన్ను పడుతుంది.
రెస్టారెంట్లు, లాటరీ సేవలపై కూడా పన్ను పోటు ఎక్కువ కానుంది. కొత్త స్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మధ్యతరగతి వారికి మేలు చేసే విధంగా జీఎస్టీ రేట్లను తగ్గించామని తెలిపారు. ఈ మార్పుల ద్వారా 99శాతం వస్తువులు 12శాతం శ్లాబ్ నుంచి 5శాతానికి, 90శాతం వస్తువులు 28శాతం శ్లాబ్ నుంచి 18శాతానికి మారుతాయని తెలిపారు.
ఈ సంస్కరణల వలన సామాన్యులపై పన్ను భారం తగ్గుతుందని దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల వల్ల సగటు జీఎస్టీ రేటు ప్రస్తుతం ఉన్న సుమారు 11.5శాతం నుంచి 10శాతం కంటే తక్కువకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రీమియాలకు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ రాబడి సుమారు రూ.9,700 కోట్ల మేర తగ్గుతుందని అంచనా. జీఎస్టీలో 12శాతం ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్, దుస్తులు వంటి ఉత్పత్తులను 5శాతం శ్లాబ్‌లోకి మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా, వినియోగం పెరగడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీ ఆదాయంలో 67శాతం ఆదాయం 18శాతం శ్లాబ్‌లోని వస్తువుల నుంచి, 11శాతం ఆదాయం 5శాతం ఉన్న వస్తువుల నుంచి వస్తోంది.
కేటగిరీ వస్తువుల వివరాలు పాత శ్లాబ్ కొత్త శ్లాబ్
రోజువారీ నిత్యావసరాలు హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్,
టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్ 18 5
బట్టర్, నెయ్యి, చీజ్ , డెయిరీ స్ప్రెడ్స్ 12 5
ప్యాక్ చేసిన నమ్ కీన్స్, భుజియా , మిక్చర్స్ 12 5
పాత్రలు : 12 5
ఫీడింగ్ బాటిళ్లు, నాప్కిన్స్, క్లినికల్ డైపర్లు 12 5
కుట్టుమిషన్లు , వాటి పార్ట్స్ 12 5
రైతులు, వ్యవసాయం ట్రాక్టర్లు, వాటి టైర్లు,పార్ట్స్ 18 5
బయో-పెస్టిసైడ్లు, రసాయనాలు , ఎరువులు 12 5
డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ , స్ప్రింక్లర్లు 12 5
వ్యవసాయం లేదా అటవీపనులకు వాడే యంత్రాలు 12 5
ఆరోగ్య సంరక్షణ వ్యక్తిగత ఆరోగ్యం , జీవిత బీమా 18 0
థర్మామీటర్ 18 5
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12 5
డయాగ్నస్టిక్ కిట్లు , రీఏజెంట్లు, గ్లూకోమీటర్ , టెస్ట్ స్ట్రిప్స్ 12 5
కళ్ళద్దాలు 12 5
ఆటోమొబైల్స్ పెట్రోల్ , పెట్రోల్ హైబ్రిడ్, ఎల్‌పిజి, సిఎన్‌జి కార్లు 28 18
డీజిల్ , డీజిల్ హైబ్రిడ్ కార్లు (4000 సీసీ పైన) 28 18
5 వీల్డ్ వాహనాలు 28 18
మోటార్ సైకిళ్లు (350 సీసీ లోపు) 28 18
వస్తువులను రవాణా చేసే వాహనాలు 28 18
ఎలక్ట్రానిక్స్ ఎయిర్ కండీషనర్లు 28 18
టెలివిజన్ (32 అంగుళాల పైన) 28 18
మానిటర్లు, ప్రొజెక్టర్లు 28 18
డిష్ వాషింగ్ మెషీన్లు 28 18
విద్య మ్యాప్స్, చార్టులు, గ్లోబ్‌లు 12 0
పెన్సిళ్లు, షార్పనర్లు, క్రేయాన్లు, పాస్టెల్స్ 12 0
ఎక్సర్‌సైజ్ బుక్స్, నోట్‌బుక్స్ 5 0
ఎరేజర్లు 5 0