బాసర ఘటన తర్వాత కూడా తీరు మారని సర్కారు

బాసర ఘటన తర్వాత కూడా తీరు మారని సర్కారు
  • రోజుకో చోట రోడ్డెక్కుతున్న విద్యార్థులు
  • హాస్టళ్లు, గురుకులాల్లో ఎప్పట్లాగే  క్వాలిటీ లేని ఫుడ్ 
  • ఏడాదిగా చాలాచోట్ల దొడ్డు బియ్యమే దిక్కు
  • అన్నంలో తరచూ పురుగులు, రుచీపచీ లేని కూరలు
  • తాజాగా నిజామాబాద్​–--భైంసా రోడ్డుపై ధర్నాకు దిగిన ముథోల్​ స్టూడెంట్లు 
  • ఐదు రోజులుగా మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన

నెట్​వర్క్​, వెలుగు: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో పెడ్తున్న తిండి తినలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్​ చేస్తూ కొద్దిరోజులుగా రాష్ట్రంలో తరుచూ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మంచి భోజనం ​సహా పలు డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్స్​ జూన్​లో వారం పాటు నిరసన దీక్ష చేపట్టిన తర్వాత కూడా సర్కారు తీరులో మార్పు రాలేదు. ఈ నెల 15న అదే ట్రిపుల్​ఐటీ లో మధ్యాహ్నం పెట్టిన ఫ్రైడ్​రైస్​ తిని 600 మంది స్టూడెంట్స్​ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. సోమవారం నిర్మల్​ జిల్లా ముథోల్​లో ట్రైబల్ ​రెసిడెన్షియల్​ స్కూల్​ విద్యార్థులు నిజామాబాద్​–భైంసా రోడ్డుపై ధర్నా చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఐదు రోజులుగా తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   

సన్న బియ్యం బంద్​.. 

హాస్టళ్లు, గురుకులాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడ్తామని రాష్ట్ర సర్కారు గొప్పగా ప్రకటించింది. కేసీఆర్​ మనుమడు ఎలాంటి అన్నం​ తింటాడో, అలాంటి ఫుడ్ ​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని మంత్రి కేటీఆర్​ఎన్నోసార్లు చెప్పారు. మొదట్లో కొన్ని నెలలు  సన్నబియ్యం సప్లయ్​ చేసినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మారింది. నిరుడు నవంబర్​, డిసెంబర్​ నుంచి అన్ని సర్కారు బడులు, హాస్టళ్లు, గురుకులాలకు దొడ్డుబియ్యమే సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఎంఎల్ఎస్ (మండల్​ లెవల్​స్టాక్​) పాయింట్స్ నుంచి తుట్టెలు కట్టిన, పురుగు పట్టిన, ముక్కిన బియ్యం వస్తున్నాయని వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు. అన్ని చోట్లా సిబ్బంది​ తక్కువగా ఉండడంతో బియ్యాన్ని చెరిగించే పరిస్థితి లేక అలాగే వండిస్తున్నారు. కాగా, రైస్​మిల్లుల నుంచి ఎంఎల్​ఎస్ పాయింట్స్​కు వచ్చే బియ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ ​చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఇన్​స్పెక్టర్లు.. మిల్లర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి ముక్కిన బియ్యాన్ని అనుమతిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా స్టూడెంట్లకు క్వాలిటీ లేని అన్నమే దిక్కవుతున్నది. దీంతో విద్యార్థులు తరచూ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులపాలవుతున్నారు. 

కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2017–-18 విద్యాసంవత్సరంలో ఖరారు చేసిన మెస్​ చార్జీలను గత ఐదేండ్లుగా పెంచలేదు. ప్రస్తుత మార్కెట్​ ధరలతో పోల్చుకుంటే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిపోతున్నాయి. 

మంత్రి హామీ ఇచ్చినా ట్రిపుల్​ఐటీలో సేమ్​ సీన్​

క్వాలిటీ ఫుడ్​ అందించాలనే ప్రధాన డిమాండ్​తో పాటు 12 సమస్యలను  పరిష్కారం కోసం బాసర ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్స్​ జూన్​14 నుంచి 21 వరకు నిరసన దీక్ష చేశారు. ఈ ఆందోళనతో రాష్ట్ర సర్కారు దిగిరాక తప్పలేదు. ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి వెళ్లారు. మంత్రి వెళ్లాక వారం రోజుల పాటు క్యాంటిన్​ ఫుడ్ ​క్వాలిటీ బాగున్నప్పటికీ ఆ తర్వాత ఎప్పట్లాగే నాణ్యతలేని తిండి పెడ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15న మధ్యాహ్నం లంచ్​లో భాగంగా అందించిన ఫ్రైడ్​ రైస్ ​తిని సుమారు 600 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  540 మందికి ట్రిపుల్​​ఐటీలోని హాస్పిటల్​తో పాటు భైంసా, ముధోల్​, నవీపేట్​, నిజామాబాద్ లో ట్రీట్​మెంట్​అందించగా.. సీరియస్​గా ఉన్న 60 మంది స్టూడెంట్స్​ను నిజామాబాద్​ హోప్​ హాస్పిటల్​కు తరలించి చికిత్స చేయించారు. దీంతో సర్కారు తీరుకు నిరసనగా మరోసారి స్టూడెంట్స్​ ట్రిపుల్​ఐటీలో ఆందోళనకు దిగారు. 

తరుచూ ఇలాంటి ఘటనలు

  • ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో క్వాలిటీ ఫుడ్​ పెట్టడం లేదంటూ ఈ నెల 10న స్టూడెంట్స్​తో పాటు  పేరెంట్స్​ ఆందోళన చేశారు. ఉడికీ ఉడకని అన్నం పెడ్తున్నారని, అది కూడా ముక్కవాసన వస్తున్నదన్నారు. వర్షాలకు హాస్టల్ గదుల్లోకి నీళ్లు వస్తున్నాయని, మూత్రశాలలు, మరుగుదొడ్లకు కుడా తలుపులు కూడా లేవని తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. 
  • యూనివర్సిటీల్లోనూ క్వాలిటీ ఫుడ్​పెట్టడంలేదని స్టూడెంట్స్​ యూనియన్లు కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. ఈ నెల 7న  తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్​ మెస్​లో   నాసిరకం ఫుడ్​పెడుతున్నారంటూ విద్యార్థులు మెస్​కు తాళం వేసి ఆందోళన చేశారు. క్వాలిటీ ఫుడ్​ వండాలని, ఫెసిలిటీస్​ మెరుగుపరచాలని డిమాండ్​ చేశారు. 
  • గద్వాల జిల్లా గట్టు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో మంచి ఆహారం పెట్టడం లేదంటూ జూన్​27న విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతకుముందు రాత్రి చికెన్ తిన్న స్టూడెంట్స్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా అందులో ఎనిమిది మంది సీరియస్​అయ్యారు. వాళ్లను గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా గట్టు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్​కు వచ్చిన  జడ్పీ చైర్​పర్సన్​ సరితను పేరెంట్స్​, బీఎస్పీ లీడర్లు నిలదీశారు. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. 
  • సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనూ విద్యార్థులకు సరైన ఆహారం అందక ఆందోళనకు దిగుతున్నారు. జూన్​27న సిద్దిపేట పట్టణంలోని  మైనార్టీ బాలికల గురుకుల స్కూల్​లో ఫుడ్​పాయిజన్​అయ్యి 128 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురయ్యారు.  స్టూడెంట్స్​కు ఆదివారం లంచ్​లో చికెన్ పెట్టారు. మిగిలిన చికెన్ గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయతో కలిపి వడ్డించడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం వైద్యసిబ్బంది చేరుకొని ట్రీట్​మెంట్​చేశారు. సీరియస్​గా ఉన్న 30 మంది స్టూడెంట్లను  సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీఎం సొంత జిల్లాలోనే  క్వాలిటీ ఫుడ్​పెట్టని పరిస్థితి ఉంటే ఎలా అని పేరెంట్స్​ మండిపడ్డారు. 

ఐదు రోజులుగా మంచినీళ్లు కూడా ఇస్తలేరు

భైంసా, వెలుగు: గత ఐదు రోజుల నుంచి తాగడానికి మంచినీళ్లు ఇవ్వడం లేదని, క్వాలిటీ ఫుడ్​ పెట్టడం లేదంటూ ముథోల్​ గిరిజన సంక్షేమ గురుకులం స్కూల్​ విద్యార్థులు  సోమవారం రోడ్డెక్కారు. తాగునీరు, ఫుడ్​ సమస్యపై ప్రిన్సిపాల్​కు తాము ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదంటూ  నిజామాబాద్​–-భైంసా రోడ్డుపై ధర్నా చేశారు. దాదాపు 3గంటల పాటు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. తమ స్కూల్​లో క్వాలిటీ ఫుడ్​ పెట్టడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని, 5 రోజుల నుంచి తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కనీసం స్నానాలకూ నీళ్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్..​ విద్యార్థుల వద్దకు చేరుకొని సమస్యను 2 రోజుల్లో పరిష్కరిస్తామని  హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్టూడెంట్స్​ ఆందోళనతో ఆఫీసర్లు హుటాహుటిన గురుకులంలో తాత్కాలికంగా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.  స్కూల్​ సమీపం నుంచి వెళ్లే మిషన్​ భగీరథ పైప్​లైన్​ నుంచి స్కూల్​లోకి నీటి కనెక్షన్​ను ఏర్పాటు చేశారు. దీంతో స్టూడెంట్స్​ 5 రోజుల తర్వాత  స్నానాలు చేయగలిగారు.