
హైదరాబాద్: తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములు దూరం కావడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు విషాద ఘటనల్లో ప్రభుత్వమే దోషి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఒకనాడు ఇదే భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్న విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లలో డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తమ భూమిని లాక్కున్నారనే మనస్తాపంతో నందీశ్వర్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా తిమ్మాపూర్ లో తమ ఊరు ముంపునకు గురవుతుండడంతో ప్రభుత్వం నుంచి పరిహారం అందక.. పెండ్లికుదరక బాలస్వామి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే దోషి అని.. భూమి లాక్కొని ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొన్నదని ఆరోపించారు.