అధికారం పోయేసరికి సెంటిమెంట్​ రెచ్చగొడుతున్నరు: బీర్ల ఐలయ్య

అధికారం పోయేసరికి  సెంటిమెంట్​ రెచ్చగొడుతున్నరు: బీర్ల ఐలయ్య

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలు మళ్లీ సెంటిమెంట్​ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా సెంటర్​లో ఆయన మాట్లాడారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్​మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఐలయ్య అన్నారు. అందులో భాగంగానే నీళ్లను ఏపీకి ఇచ్చారని చెప్పారు. తన ఫామ్ హౌస్​ వరకు నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్.. ఆ ఫామ్ హౌస్​ చుట్టుపక్కల మండలాలకు మాత్రం నీళ్లివ్వలేదని వివరించారు.

 నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్​ పార్టీ అని గుర్తుచేశారు. డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీని కాంగ్రెస్​ స్టార్ట్​ చేసినా వాటిని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. అందుకే నల్గొండ ఎడారిగా మారిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో  కేసీఆర్​ కుటుంబం చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమా అని సవాల్​విసిరారు. నల్గొండ రైతులకు క్షమాపణ చెప్పి.. ఆ తర్వాతే అక్కడ అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు. ధర్నాలకు తామేం వ్యతిరేకం కాదని.. ధర్నాలు చేసుకునే హక్కులు లేకుండా ధర్నా చౌక్​ను ఎత్తేసింది గత కేసీఆర్ ​సర్కారేనని వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్​కు అలవాటేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్​ ఫ్యామిలీకే పోయాయని విమర్శించారు.