పెండింగ్‌‌ వేతనాలు చెల్లించాలని జీపీ కార్మికుల నిరసన

పెండింగ్‌‌ వేతనాలు చెల్లించాలని జీపీ కార్మికుల నిరసన
  • హనుమాన్ టెంపుల్‌‌ ప్రహరీ కూల్చొద్దని కాలనీ వాసుల ఆందోళన
  • డాక్టర్ ప్రీతి మృతి కారకులపై హత్య కేసు పెట్టాలని గిరిజనుల డిమాండ్


మెదక్, సంగారెడ్డి టౌన్‌‌, సిద్దిపేట రూరల్, వెలుగు:ఉమ్మడి మెదక్‌‌లోని మూడు కలెక్టర్లు ధర్నాలతో దద్దరిల్లాయి.  సోమవారం వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.  గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీపీఎం, సీఐటీయూ, పంచాయతీ ఎంప్లాయీస్‌‌, వర్కర్స్‌‌ యూనియన్‌‌ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. సంగారెడ్డిలో ఖాళీ విస్తరాకులతో నిరసన తెలిపారు.  సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ  గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు.  కార్మికులకు సబ్బులు, నూనె , బెల్లం, డ్రెస్సులు రెగ్యులర్‌‌‌‌గా ఇవ్వాలనే రూల్‌‌ ఉన్నా  పట్టించుకోవడం లేదన్నారు. 2021 జూన్ 27న సీఎం కేసీఆర్‌‌‌‌ పంచాయతీ కార్మికులకు పీఆర్సీ తరహా వేతన ఒప్పందం చేశామని ప్రకటించినా.. నేటీకి అమలు చేయడం లేదని మండిపడ్డారు.  

జీవో 60 ప్రకారం వేతనాలివ్వాలి

సీపీఎం మెదక్‌‌ నాయకురాలు నర్సమ్మ,  సిద్దిపేట పంచాయతీ వర్కర్స్‌‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేశ్ మాట్లాడుతూ కార్మికులకు జీవో 60 ప్రకారం ప్రతినెల  రూ. 16,500 నుంచి రూ. 22,700 వరకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో 51 సవరించాలని , కార్మికులు చనిపోతే వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.  ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత , ఈఎస్ఐ, పీఎఫ్‌‌  సౌకర్యాలు కల్పించాలన్నారు. వారంలోగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేదంటే  నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.  అనంతరం కలెక్టర్‌‌‌‌, అడిషనల్‌‌ కలెక్టర్లకు వినతి పత్రం అందించారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్,  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, నేతలు, కార్మికులు సత్తయ్య ,అశోక్ ,వెంకటయ్య, శంకర్ ,కిష్టయ్య ,తిరుపతి , రాజు, లక్ష్మి యాదమ్మ ,సుజాత, కనకా చారి, అండాలు, ప్రభాకర్ పాల్గొన్నారు.

టెంపుల్‌‌ జోలికి రావొద్దు

మెదక్– సిద్దిపేట నేషనల్ ​హైవే నిర్మాణంలో భాగంగా మెదక్ పట్టణ శివారులోని తారకరామ నగర్ కాలనీ రోడ్డు పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్​ ప్రహరీ కూల్చొద్దని మాజీ కౌన్సిలర్  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.  సోమవారం కాలనీ వాసులతో కలిసి  బైక్ ర్యాలీగా కలెక్టరేట్​కు వెళ్లి ఆందోళన చేపట్టారు. అనంతరం దేవాలయానికి ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషాకు మెమోరాండం సమర్పించారు.  డాక్టర్‌‌ ప్రీతి మృతికి కారణమైన వారిని సస్పెండ్ చేసి, హత్య కేసు నమోదు చేయాలని నంగర భేరి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్​ డిమాండ్ చేశారు.  సోమవారం స్టూడెంట్స్​, యువకులతో కలిసి కలెక్టరేట్‌‌కు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రీతి చనిపోయి వారాలు గడుస్తున్నా.. నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.