
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్‌ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టెన్త్ ఫలితాల్లో మార్కులు కాకుండా కేవలం గ్రేడింగ్స్ మాత్రమే ఇచ్చేవారు. ఈ ఏడాది గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఫైనల్ రిజల్ట్ ఎలా ఇవ్వాలనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డు, ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు.
మెమోల్లో గ్రేడింగ్ కంటే ముందున్నట్టు మార్కులు, డివిజన్స్ ఇవ్వాలా? మార్కులు గ్రేడింగ్ కలిపి ఇవ్వాలా? అనే దానిపై వివరణ కోరారు. ఈ క్రమంలో దీనిపై స్పష్టత ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటర్నల్ మార్కులు, ఎక్స్ టర్నల్ మార్కులు, గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. చివర్లో మాత్రం మొత్తం మార్కులు ఇస్తూ మాత్రమే ఇవ్వనున్నారు. గ్రేడింగ్, డివిజన్స్ ఇవ్వబోరు. మరోపక్క కో కరికులమ్ యాక్టివిటీస్ లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. కాగా, మార్చి 21 నుంచి ఈ నెల 4 వరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 5.09 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను ఒకటి,
రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.