- ఒట్లు వేయించుకునుడు... కాళ్లు మొక్కుడు
- ప్రచారం ముగియడంతో రహస్య మీటింగుల్లో అభ్యర్థులు, లీడర్లు
- మద్యం, డబ్బు పంపిణీపై అధికారుల నిఘా
పెద్దపల్లి, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో ప్రలోభాలు షురూ అయ్యాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తున్న అభ్యర్థులు, లీడర్లు ఒట్లు వేయించుకోవడంతోపాటు దండాలు పెడుతూ ఓట్లు అడుగుతున్నారు. ఈక్రమంలో ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచేందుకు అభ్యర్థులు, లీడర్లు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ప్రలోభాలపై నిఘా పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఓట్ల కోసం వేట
గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు ఎప్పుడూ లేని విధంగా ఓటర్లను వేడుకోవడం కనిపిస్తోంది. తనకే ఓటేస్తామని ఓటర్లతో ఒట్లు వేయించుకోవడం, కాళ్లు మొక్కడం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రత్యేకంగా ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఓటేయమని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా ఉండనుంది.
ఎన్నికల వేళ శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ఆయా జిల్లాలో పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. డబ్బు, మద్యం రవాణా, పంపిణీపై దృష్టి పెట్టారు. ఎక్కడిక్కడ వాహన చెకింగ్‌లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడా మద్యాన్ని పోలీసులు సీజ్చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.
తొలివిడతకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల కోసం పోలింగ్స్టేషన్లను అధికారులు రెడీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ట్రైసైకిళ్లతో పోలింగ్ సెంటర్లలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 380 సర్పంచ్స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పెద్దపల్లిలో 95, కరీంనగర్ 89, జగిత్యాల 118, రాజన్న సిరిసిల్ల 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిల్లో 1,526 మంది పోటీలో ఉన్నారు. ఇన్నటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 26 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.

