భద్రాచలం, వెలుగు : హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆదివార భద్రాచల సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. రామరథంలో హైదరాబాద్‌కు చేరుకున్న సీతారామచంద్రస్వామి ప్రభువుకు ఘనంగా స్వాగతం పలికారు. వేదికపై స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక వరుస క్రమంలో నిర్వహించి కల్యాణ క్రతువు చేశారు. చివరిగా స్వామికి మంత్రపుష్పం సమర్పించి విశేష హారతులు అందజేశారు.
భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దైవజ్ఞశర్మతో పాటు దేవస్థానం ఈవో దామోదర్‌రావు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. భద్రాచలంలో ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ చేసిన అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మంజీరాలు భక్తులకు పంపిణీ చేశారు. మూలవరులను అందంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.
భక్తులు ఈ అర్చనలో పాల్గొని పులకించిపోయారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య హారతులు ఇచ్చారు. బేడా మండపంలో నిత్యకల్యాణం జరిగింది. సాయంత్రం దర్బారు సేవ చేసి సీతారామచంద్రస్వామికి దివిటీ సలాం ఇచ్చారు.
