టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు : బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు :  బూర నర్సయ్య గౌడ్

అందరితో సన్నిహితంగా, ఆప్యాయంగా ఉండే సీఎం కేసీఆర్ ప్రజలకు దూరం అవుతున్నారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేసీఆర్ వ్యవహార శైలితో టీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో పలువురు బీజేపీ పెద్దలను కలిసిన అనంతరం ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆనంతరం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని, ఎలాంటి అవకాశం వచ్చిన పార్టీలో నుండి వెళ్లి పోయేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. 

టీఆర్ఎస్ లో ఘోరంగా అవమానాలుంటాయి

టీఆర్ఎస్ లో ఘోరంగా అవమానాలుంటాయన్న నర్సయ్య గౌడ్.. ఆసలు పార్టీలో ఎందుకున్నామో తెలియదని చాలా మంది నేతలు అనుకుంటున్నారన్నారు. మంత్రులకైతే వారి శాఖ ఏంటో వారికే తెలియని పరిస్థితి ఉందన్నారు. డాక్టర్ గా కష్టపడి టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, కానీ పార్టీలో తనని దూరం పెట్టే ప్రయత్నాలు జరిగాయని నర్సయ్య గౌడ్  ఆరోపించారు. మునుగోడు టికెట్ తనకే దక్కాలని అనుకోలేదని, పదవుల కోసం పాకులాడే వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ కాదని స్పష్టం చేశారు. పదవి లేకున్నా సరే కానీ మనుషులకు గౌరవం కూడా లేకపోతే పార్టీలో  ఉండటం దేనికని ప్రశ్నించారు.  

కేసీఆర్  తీరుతో ఆ పరిస్థితి లేదు

పార్టీలో తనకు జరిగిన అవమానం  కేటీఆర్ కు జరిగితే తనకంటే 100 రెట్లు ఎక్కువగా రియాక్ట్ అయ్యేవాడన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్నాను కానీ కేసీఆర్  తీరుతో ఆ పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరని నర్సయ్య గౌడ్ జోస్యం చెప్పారు. కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలతో సమావేశం అనంతరం వారి సూచన మేరకు ఏ పార్టీలో చేరేది తెలుపుతానని నర్సయ్య గౌడ్ తెలిపారు.