కరోనా ఎఫెక్ట్‌‌‌‌: క్వారీల్లోనే గ్రానైట్.. చైనాకు నిలిచిపోయిన ఎగుమతులు

కరోనా ఎఫెక్ట్‌‌‌‌: క్వారీల్లోనే గ్రానైట్.. చైనాకు నిలిచిపోయిన ఎగుమతులు

కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటి దాకా చైనా నుంచి వచ్చే వాటిపైనే ఎఫెక్ట్‌‌‌‌ చూపిన ఈ వ్యాధి.. తాజాగా మన దగ్గర నుంచి అక్కడికి వెళ్లే ముడి సరుకులపై ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో గ్రానైట్‌‌‌‌ పరిశ్రమను దెబ్బకొట్టింది. ఎగుమతులు ఆగిపోయాయి. ముడిసరుకు క్వారీలకే పరిమితమైంది. పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపైనా దెబ్బపడుతోంది.

నెలకు 60 వేల క్యూబిక్‌‌‌‌ మీటర్లు

ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని కొన్ని జిల్లాలతోపాటు రాష్ర్టంలోని కరీంనగర్‌‌‌‌, ఖమ్మం, వరంగల్‌‌‌‌, నల్గొండ జిల్లాల్లో వివిధ గ్రానైట్‌‌‌‌ రకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలోని కరీంనగర్‌‌‌‌ రూరల్, గంగాధర, హుజూరాబాద్, కేశవపట్నం, వీణవంక, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి పరిధిలో క్వారీలు ఉన్నాయి. రాష్ట్రంలో 70 శాతం గ్రానైట్‌‌‌‌ ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లా నుంచే లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు 60 వేల క్యూబిక్‌‌‌‌ మీటర్ల గ్రానైట్‌‌‌‌ తవ్వితే, అందులో ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లా నుంచే 50,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తవ్వుతారు. ఈ ముడి సరుకులో ఎక్కువ శాతం చైనాకు వెళ్తుంది. కాకినాడ రేవు ద్వారా చైనాకు ఎగుమతి చేస్తారు.

అట్ల పోయినోళ్లు ఇట్ల రాలె..

చైనాలో జనవరి 25వ తేదీ నుంచి కొత్త సంవత్సరం సంబురాలు జరుపుకుంటారు. మన దగ్గర గ్రానైట్‌‌‌‌లలో పనిచేసే చైనీయులు ఫెస్టివల్ కోసం అక్కడికి వెళ్లారు. తిరిగి వచ్చేద్దామనే సమయంలోనే కరోనా విజృంభించింది. దీంతో చైనా నుంచి వివిధ దేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సంబురాలకు వెళ్లిన వాళ్లు అక్కడే ఉండిపోయారు. వాస్తవానికి చైనా కంపెనీల ప్రతినిధులే లావాదేవీలన్నీ చూస్తుంటారు. రాష్ట్రానికి వచ్చి గ్రానైట్‌‌‌‌ నాణ్యతను పరిశీలిస్తారు. ఎంత గ్రానైట్‌‌‌‌ కావాలో వారే కొలతలు వేస్తారు. పోర్ట్‌‌‌‌ల నుంచి ముడి గ్రానైట్‌‌‌‌ ఎగుమతి అయ్యే దాకా ఇక్కడే ఉండి చూసుకుంటారు. కరోనా ప్రభావం తగ్గే దాకా వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కొందరు గ్రానైట్‌‌‌‌ వ్యాపారులు మాత్రం మరో పది రోజుల్లో ఈ సమస్య తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు కోటిన్నర లాస్‌‌‌‌!

రాష్ట్రంలో 250 వరకు గ్రానైట్‌‌‌‌ క్వారీలు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌‌‌‌ వల్ల తవ్విన గ్రానైట్‌‌‌‌ మొత్తం క్వారీలకు పరిమితమవుతోంది. దీంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. గ్రానైట్‌‌‌‌ ద్వారా రాష్ట్రానికి ఏటా 450 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. అంటే ప్రస్తుతం రోజుకు కోటిన్నర వరకు నష్టం వస్తోంది. నెలరోజుల్లో సుమారు 45 కోట్ల దాకా లాస్‌‌‌‌ వచ్చింది. అంతేకాకుండా గ్రానైట్‌‌‌‌ పరిశ్రమతోపాటు, దాని అనుబంధ వ్యాపారం, కార్మికులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నష్టాలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గ్రానైట్‌‌‌‌ పరిశ్రమపై లక్ష మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

అక్కడే ఉండిపోయిన్రు

చైనాలోని గ్రానైట్‌‌‌‌ తయారీ ప్రావిన్స్‌‌‌‌లలో కరోనా ప్రభావం పెద్దగా లేదు. కొత్త సంవత్సరం సంబురాలకు వెళ్లిన చైనీయులు అక్కడే ఉండిపోయారు. మరో పది రోజుల్లో వారు తిరిగొస్తారనే సమాచారం ఉంది. అప్పుడు కూడా రాకుంటే పరిశ్రమపై మరింత ఎఫెక్ట్‌‌‌‌ పడుతుంది.

– సతీశ్ రెడ్డి, గ్రానైట్‌‌‌‌ వ్యాపారి, కరీంనగర్‌‌‌‌

ఎగుమతులు ఆగినయ్

కరోనా భయంతో చైనాకు గ్రానైట్ ఎగుమతులు ఆగిపోయాయి. రాష్ట్రంలోని గ్రానైట్‌‌‌‌ ఎక్కువ చైనాకే వెళ్తుంది. అక్కడి వ్యాపారులు వచ్చి రా మెటీరియల్ కొనుక్కెళ్లేవారు. వాళ్లు రాకపోవడంతో క్వారీలకు చాలా నష్టం వాటిల్లుతోంది. మెటీరియల్ క్వారీలకే పరిమితమైంది.

– సాగర్‌‌‌‌ రెడ్డి, గ్రానైట్ వ్యాపారి, ఖమ్మం

ఎఫెక్ట్ చాలా ఉంది

చైనాలో కరోనా వైరస్ స్టార్ట్ అయిన నాటి నుంచి వ్యాపారులు రావటం లేదు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వచ్చి మార్బుల్స్, గ్రానైట్, రా మెటీరియల్ చూసుకొని ఆర్డర్ ఇచ్చి వెళ్లేవారు. ఈ 3 జిల్లాల్లో నెలకు రూ.100 కోట్ల వ్యాపారం జరిగేది. వ్యాపారం లేకపోవడంతో ఉద్యోగులను కూడా తగ్గించే యోచనలో ఉన్నాం. ఏటా మార్చి 6వ తేదీ నుంచి 9 వరకు చైనాలో గ్రానైట్ ఎగ్జిబిషన్ జరిగేది. ఈ ఏడాది అది రద్దు అయింది.

– సాధు రమేశ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు, గ్రానైట్ అసోసియేషన్

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి