ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ కు రూ.43.65 కోట్లు మంజూరు:మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మహర్దశ పట్టనుందని మంత్రి కమలాకర్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి రూ.43.65కోట్లు, కరీంనగర్ నియోజకవర్గానికి రూ.4.25కోట్ల ఉపాధిహామీ నిధులను మంజూరు చేస్తూ డిసెంబర్​6న పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అంతర్గత రోడ్లన్నింటిని సీసీ రోడ్లుగా మార్చుకుందామని చెప్పారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు  పాలనాపరమైన అనుమతులు వచ్చాయని మినిస్టర్​ 
తెలిపారు.

కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ గా హరిశంకర్

బీఆర్ఎస్ కరీంనగర్ పట్టణాధ్యక్షుడిగా చల్ల హరిశంకర్ ను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రకటించారు. ఆదివారం స్థానిక మంత్రి కమలాకర్ నివాసంలో హరిశంకర్ కు రామకృష్ణారావు నియామక పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా మినిస్టర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మేయర్ సునీల్ రావు హరిశంకర్ ను సన్మానించారు. హరిశంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించినందుకు మంత్రి, మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ప్రమోద్ రావు పాల్గొన్నారు.

గంగుల మల్లయ్య చిత్రపటానికి నివాళి..

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మృతి చెందడంతో మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రవిచంద్ర మల్లయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. వారి వెంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, విప్ సుమన్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, వెంకటరమణారెడ్డి, మనోహర్ రెడ్డి, రామన్న తదితరులు ఉన్నారు.


‘నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం’

జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం పట్టణంలో విజయ గ్యాస్ట్రో అండ్ న్యూరో హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని హాస్పిటల్​నిర్వాహకులు పవన్ కుమార్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణి, కొడిమ్యాల జెడ్పీటీసీ ప్రశాంతి విజయ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ అనుభవం కలిగిన గ్యాస్ట్రో ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ అమరావతి న్యూరో వైద్య నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సతీశ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 


అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం:  మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

జగిత్యాల, వెలుగు: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జగిత్యాల పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రతిపక్షాలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో కొత్త మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు విలువైన సూచనలు చేస్తే తీసుకుంటామని, అర్థంలేని విమర్శలు చేస్తే సహించమన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే మాస్టర్ ప్లాన్ లో హస్నాబాద్, తిమ్మాపూర్,  తిప్పన్న పేట గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మోతె, వెల్దుర్తి గ్రామ పంచాయతీ రహదారి పరిధిలో పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ గా ఏర్పడిందని టౌన్ ప్లానింగ్, డీటీసీపీ అధికారులతో మాట్లాడి మార్పు చేస్తున్నామన్నారు.  సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీలత, పద్మ, ముస్కు నారాయణ రెడ్డి, కప్పల శ్రీకాంత్, క్యాదాసు నవీన్, కోలగాని సత్యం  తదితరులు 
పాల్గొన్నారు.


భూగర్భ గనిని సందర్శించిన కలెక్టర్

గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం ఏరియాలోని జీడీకే 7ఎల్ఈపీ భూగర్భ గనిని ఆదివారం పెద్దపల్లి కలెక్టర్ సంగీత, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ దీపక్, ఏరియా జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. గనిని కోల్ టూరిజంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గని బయట ఏర్పాటు చేసిన యంత్రాల నమూనాలను, సంస్థకు సంబంధించిన చరిత్రను ప్రొజెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం గనిలోకి దిగి పని స్థలాలను వీక్షించారు. వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ గని విశేషాలను, బొగ్గు ఉత్పత్తి చేసే విధానం, రక్షణ చర్యల గురించి వివరించారు. అలాగే యైటింక్లయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలోని రెస్క్యూ స్టేషన్ లో ప్రమాదాల నుంచి కార్మికులను ఎలా రెస్క్యూ చేస్తారనే విషయాలను తిలకించి ఓసీపీ-3 వ్యూ పాయింట్ నుంచి బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొగ్గు ఉత్పత్తి తదితర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగీత మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు భూగర్భ గనిలో ధైర్య సాహసాలతో పని చేస్తూ దేశానికి వెలుతురు అందిస్తున్నారన్నారు. వారి వెంట ప్రాజెక్ట్ అధికారి జి.మోహన్ రెడ్డి, గని మేనేజర్ నీలేశ్ ​మహేంద్ర, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవ రావు తదితరులు ఉన్నారు.