జర మారున్రి: మాలెక్కనే అంతమైపోతరా!

జర మారున్రి: మాలెక్కనే అంతమైపోతరా!
  • జనానికి గ్రాఫిక్ డైనోసార్ హెచ్చరిక
  • యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో స్పీచ్ 
  • వాతావరణ మార్పులపై సరికొత్తగా యూఎన్ మెసేజ్​

యునైటెడ్ నేషన్స్: దాదాపు ఆరున్నర కోట్ల ఏండ్ల నాటి మాట.. ఓ పెద్ద ఉల్క వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో జీవులన్నీ చచ్చిపోయినయ్. అప్పట్లో భూమిని ఏలిన డైనోసార్ల అడ్రస్ కూడా గల్లంతైపోయింది. అప్పట్లో అంటే అంతరిక్షం నుంచి వచ్చి పడ్డ ఉల్కతో మహా విపత్తు సంభవించింది. కానీ.. ఇప్పుడు మనుషులు తమంతట తామే భూగోళాన్ని నాశనం చేస్తూ చేతులారా పెను విపత్తును కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని జనాలకు మరింత బాగా అర్థమయ్యేలా ఆనాటి డైనోసార్ నోటితోనే చెప్పించాలని భావించిన ఐక్యరాజ్యసమితి(యూఎన్​) తాజాగా గ్రాఫిక్ డైనోసార్ తో వాతావరణ మార్పు సమస్యపై స్పీచ్ ఇప్పించింది. జనం అనే మనం అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో.. అంతరించిపోయిన ఆ డైనోసార్లతోనే చెప్పించింది.

జర ఇనున్రి..

జనాలూ.. జర ఇనున్రి అంటూ గళం విప్పిన ఆ డైనోసార్​.. అంతమంటే ఏంటో తనకు తెలుసని, జనాలూ తెలుసుకోవాలని చెప్పింది. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 7 కోట్ల ఏండ్లలో జనం అన్న మాట వినిపించదని హెచ్చరించింది. అంతరించిపోవడమంటే.. దాని కన్నా మాచెడ్డ విషయం ఇంకోటి ఉండదని పేర్కొంది. మరి, మిమ్మల్ని మీరే చంపేసుకుంటారా? అంటూ ప్రశ్నించింది. ఒకవేళ అదే జరిగితే.. తాను వినే మొట్టమొదటి వింత అదేనంది. ఓ ఆస్టరాయిడ్​(గ్రహశకలం) వచ్చేసి భూమిని ఢీకొడితే పరిస్థితేంటి? అంటూ సూటిగా నిలదీసింది. ‘‘మీరు విపత్తువైపు దూసుకెళ్తున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఫాజిల్​ ఫ్యూయెల్​ (భూమి నుంచి వెలికి తీసే చమురు/శిలాజ ఇంధనాలు) మీద వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అదే ఖర్చు ఓ పెద్ద ఆస్టరాయిడ్​ మీదనో లేదంటే ఉల్క మీదనో పెడితే వచ్చే ముప్పెలా ఉంటుందో ఊహించండి? ఇప్పుడు మీరు చేస్తున్నదీ అదే. అదే డబ్బును దునియాలోని ఎన్నో దేశాల్లో పేదరికంలో మగ్గుతున్న వారిపై ఖర్చు పెడితే బాగుంటుంది కదా. ఆకలితో అలమటిస్తున్న అలాంటి వారికి సాయం చేయాలని అనిపించలేదా?’’ అంటూ పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. 

కండ్లు తెరువున్రి.. మారున్రి

క్లైమేట్ చేంజ్​తో అలాంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇంకా చాన్స్​ ఉందని, ఇప్పటికైనా మారాలని డైనోసార్​ మంచి చెప్పింది. ‘‘కరోనా నుంచి ఇప్పుడిప్పుడే మిమ్మల్ని మీరు బాగుచేసుకుంటున్నారని తెలుసు. కానీ, మీ అంతానికి మీరే కారణమవుతారా? టైం దాటిపోక ముందే కండ్లు తెరవండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. అంతం నుంచి బయటపడండి. ఇకనైనా మారండి. అందుకు వంకలు వెతుక్కోకండి’’ అని సూచించింది. వెంటనే హాలంతా చప్పట్లతో మార్మోగింది. కాగా, యూఎన్​ లోపల తీసిన తొలి యానిమేటెడ్​ డాక్యుమెంటరీ ఇదేనని యూఎన్​డీపీ తెలిపింది.