గ్రేట్ తెలంగాణ : విత్తనాలు చల్లి వరి సాగు చేస్తున్న రైతులు

గ్రేట్ తెలంగాణ : విత్తనాలు చల్లి వరి సాగు చేస్తున్న రైతులు

వరిసాగులో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. కూలీల కొరత, ఖర్చులు తగ్గించడానికి ఈ మధ్య 'కరేదా పద్ధతి'లో వరి సాగు చేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిలో నాటు వేయాల్సిన అవసరం ఉండదు. విత్తనాల్ని పొలంలో నేరుగా చల్లితే చాలు. వరి ఏపుగా పెరుగుతుంది. ఈ ప్రాసెస్ వల్ల టైం కూడా చాలా మిగులుతుంది. అందుకే ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రైతులంతా ఈ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు.

ALSO READ: Kitchen Tips : పచ్చి మిర్చి రెండు నెలలు తాజాగా ఉండాలంటే ఇలా చేయాలి..!

నాట్లు వేసే టైంకి కూలీలు దొరక్క చాలా ఎకరాల్లో నారు ముదిరిపోతోంది. దానివల్ల దిగుబడి బాగా తగ్గుతోంది. పైగా కూలీలకి ఎకరానికి ఆరు నుంచి పదివేలు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు డిమాండ్ ని బట్టి కూలీలకి ఇంకాస్త ఎక్కువే ఖర్చుపెట్టాల్సి వస్తుంది. పైగా మామూలు పద్ధతిలో ముందుగా పొలంలో నారు పోసి 20నుంచి 25 రోజులు ఆగి, నారు ఎదిగాక నాటేస్తారు. కానీ ఈ ప్రాసెస్లో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం వల్ల టైం మిగులుతుంది. విత్తనాల వాడకం కూడా తగ్గుతుంది. దాంతో ఎకరానికి పదివేల వరకు ఆదా అవుతున్నాయి. అందుకే వరి సాగుకి కరేదా పద్ధతినే ఎంచుకుంటున్నారు. రైతులు. దీనివల్ల దిగుబడి కూడా బాగా వస్తుందంటున్నారు.

సాగు పద్ధతి ఇలా..!

• ఎకరాకు 15కిలోల విత్తనాలను 24 గంటలు నానబెట్టి, గోనె సంచిలో మండెకట్టాలి. విత్తనాలు చల్లే ముందు
పొలం తడిగా ఉండేలా చూసుకోవాలి.
• చదును చేసిన పొలంలో 65 కిలోల డీఏపీ చల్లి. విత్తనాలు చల్లాలి. ఐదో రోజు పొలంలోని నీళ్లన్నీ వెళ్లదీసిన తర్వాత నెల రోజుల పాటు నీటి తడులు పెట్టాలి.
• విత్తనాలు చల్లిన 15 రోజులకి 10కిలోల యూరియా చల్లాలి..
• 25 రోజుల తర్వాత కలుపు(గడ్డి) మందును పొలమంతా పిచికారి చేయాలి. 45 రోజులకు 50 కిలోల
యూరియా, చిరుపొట్ట దశలో 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ ను పొలంలో చల్లాలి.

దిగుబడి బాగుంది

మా ఊరి రైతులంతా కిందటి ఏడాది కరేదా పద్ధతిలోనే వరి సాగు చేశారు. వాళ్లకి ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాంతో నేను కూడా ఈ ఏడాది కరేదా పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నా. ఎకరానికి 15 కిలోల విత్తనం మండె కట్టి రెండో రోజు మొలక రాగానే బురద పొలంలో చల్లా. దాంతో దాదాపు పదివేలు ఆదా అయ్యాయి.

-ఆత్కూరి పద్మ, కొర్లకుంట ::: మహాముత్తారం, వెలుగు