వాన తగ్గినా.. వరద పోలే.. హైదరాబాద్​కి ఎల్లో అలర్ట్​

వాన తగ్గినా.. వరద పోలే.. హైదరాబాద్​కి  ఎల్లో అలర్ట్​
  • గ్రేటర్​లోని కాలనీలు, ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు

హైదరాబాద్/మూసాపేట/కుషాయిగూడ/ముషీరాబాద్/ఎల్​బీనగర్​గండిపేట/శంకర్​పల్లి,వెలుగు: సిటీలో కురుస్తున్న వానలకు కాలనీలు, ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం కాస్త తక్కువ వర్షం పడింది. అది కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కురవడంతో ఎప్పటికప్పుడు నీటిని తొలగించుకున్నారు. ఇక చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సూరారం చెరువు నిండి వరద దిగువకు ప్రవహిస్తుండటంతో కుత్బుల్లాపూర్​లోని ఓక్షిత్ కాలనీ నీట మునిగింది. దీంతో అక్కడ జనం ఇండ్లకే పరిమితమయ్యారు. 

సరూర్ నగర్ చెరువు నిండటంతో నీటిని బయటకు వదలగా.. కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. దూద్​బౌలిలో పురాతన ఇండ్లల్లో ఉంటున్న వారిని బల్దియా అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఇండ్లను కూల్చి వేశారు. మూసాపేటలోని ఐడీఎల్ చెరువు, గాజులరామారంలోని పెద్ద(సూరారం) చెరువులు డేంజర్​గా మారాయి.షేక్ పేట పరిధి ఓయూ కాలనీ రోడ్లపై వరద నీరు చేరింది. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గ్రేటర్​లో 428 మాన్ సూన్ టీమ్స్ , 27 డీఆర్ఎఫ్ టీమ్స్​ 24 గంటల పాటు పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

రెండ్రోజులుగా హెల్ప్ లైన్​కు 500 కిపైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 323 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6  వరకు డీఆర్ఎఫ్​ టీమ్స్​కు 47 ఫిర్యాదులు అందాయి. ఎమర్జెన్సీ అయితే బల్దియా హైల్ప్ లైన్ నం. 040–--21111111,  డీఆర్ఎఫ్ టీమ్స్ సాయం కోసం 9000113667కు కాల్ చేయాలన్నారు. హుస్సేన్ సాగర్​కు భారీగా వరద చేరుతుండటంతో ఇరిగేషన్, బల్దియా అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల జనాలను అలర్ట్ చేశామని, మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.  భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. 

శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చేస్తున్న నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలని వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వానల నేపథ్యంలో  డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎలుం, డీజీఎంలు, ఇతర అధికారులతో  ఖైరతాబాద్ లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో ఆయన  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ముంపు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు, సివర్ జెట్టింగ్ మెషీన్లతో ఆయా డీజీఎంలు తనిఖీ చేయాలన్నారు. 

మూసాపేట డివిజన్ పరిధి బబ్బుగూడలో ఉంటున్న బొల్లం లక్ష్మి ఇల్లు మూడ్రోజులుగా వానకు నానడంతో శుక్రవారం ఉదయం కూలిపోయింది. కుషాయిగూడ బస్ డిపో  రూట్​లో అంబర్​పేటకు చెందిన ఓ వ్యకి కారులో వస్తుండగా దానిపై చెట్టు విరిగిపడింది. చర్లపల్లి, మర్రిగూడ, అశోక్​నగర్​ బస్తీలు నీటమునిగాయి. శంకర్ పల్లి మండలం పిల్లిగుండ్ల, మోకిల, ప్రొద్దటూర్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

జీహెచ్ఎంసీకి  ఫిర్యాదుల వెల్లువ.. నిండుకుండలా మారిన చెరువులు

వానలు పడితేనే వస్తరా?

బషీర్​బాగ్: హిమాయత్​నగర్ స్ట్రీట్ నం.14లో వరద ముంపునకు గురైన ఆదర్శ్​బస్తీ, నల్లకుంట పద్మనగర్, నాగయ్యకుంట, అడిక్ మెట్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం(ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్) ప్రకాశ్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఆదర్శ్​బస్తీలో ఇండ్లలోకి చేరిన వర్షపు నీటిని మాన్​సూన్ ఎమర్జెన్సీ టీమ్, డీఆర్ఎఫ్ టీమ్స్ మోటార్ల సాయంతో బయటికి పంపించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆదర్శ్​బస్తీలో నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేసి వరద రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 24 గంటల పాటు 428 మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 27 డీఆర్ఎఫ్​ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. 

బల్దియా కంట్రోల్ రూమ్ కు వచ్చే కంప్లయింట్లను వెంటనే పరిష్కరించేలా గ్రౌండ్ లెవెల్​లో సిబ్బందిని అలర్ట్ చేశామన్నారు.  వాన పడితే భయంతో బతకాల్సి వస్తోందని ఆదర్శ్ బస్తీకి మహిళ సాజిదా కమిషనర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త దివ్యాంగుడని, ఇంట్లోకి నీళ్లు చేరితో ఆయనను బంధువుల ఇంటికి తీసుకెళ్లడం తనకు ఇబ్బందిగా మారిందని సాజిదా తెలిపింది. ఎమ్మెల్యే, అధికారులు కేవలం వర్షాలు పడినప్పుడే వచ్చి తక్షణ సాయం చేస్తామంటారే తప్ప ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం లేదని ఆమె బాధను వ్యక్తం చేసింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరింది. 

సిటీలో మరో నాలుగు రోజులపాటు  వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, మంగళవారం భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని పేర్కొన్నారు. సిటీకి ఎల్లో అలర్ట్(6.5 సెంమీ. నుంచి 11.5 సెంమీ వర్షం కురిసే అవకాశం)ను జారీ చేశారు.