మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి.. కేజీ ధర ఎంతంటే..?

 మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి.. కేజీ ధర ఎంతంటే..?

ఎండల తీవ్రతతో చికెన్‌, కోడిగుడ్ల ధరలు భగ్గుమంటున్నాయి. కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. వారం వ్యవధిలోనే చికెన్‌ కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు.. కోడిగుడ్డు ఒక్కొక్కటి రూపాయి మేర పెరిగింది. గత వారం చికెన్‌ స్కిన్‌లెస్‌ ధర కిలో రూ.200 ఉండగా ఈ ఆదివారం రూ.230కి చేరింది. వారం నుంచి ఎండల తీవ్రతతో కోళ్ల ఫాంలలో పెంపకం తగ్గిపోయింది. కొన్నిచోట్ల ఉక్కపోత వాతావరణంతో కోళ్లు మృత్యువాతపడ్డాయి. 

కోడి ధర కొండెక్కింది. ఎండలు పెరిగిపోతుండడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల్లో ధరలు విపరీతంగా పెరిగాయి.  ఈ ధరలతో కొనలేక.. తినకుండా ఉండలేక మాంసాహార ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు కోళ్ల పెంపకం తగ్గిపోతుండడంతో కొన్నిచోట్ల మాంసం ధర కేజీ రూ. 180 నుంచి 270 వరకు పెరిగింది. పౌల్ట్రీల్లో కోళ్లు తీవ్ర ఎండలు, వడగాలులకు చనిపోతున్నాయి. ముందే గ్రహించిన వ్యాపారులు  నష్టాల నుంచి గట్టెక్కడానికి పౌల్ట్రీలను మూసివేశారు. దీని ప్రభావంతో దిగుబడి అమాంతం తగ్గిపోయింది. ఇదే సమయంలో కోళ్లకు డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగాయి. వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఇవి మరింత ముదిరితే చికెన్‌ ధరలు ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. ఎండలకు కోడి మాంసం కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా.. పరిస్థితి అలా కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్‌ కూడా ఉండడంతో కోళ్ల మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. 

గత ఏడాది కంటే చికెన్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పట్లో కేజీ కోడి మాంసం ధర రూ. 150 నుంచి 180 వరకు ఉండేది. ఈ ఏడాది రూ.230 నుంచి 270 వరకు చేరుకుంది. ఎన్నడూ లేనివిధంగా చికెన్‌ ధరలు పెరిగాయని వ్యాపారులు కూడా చెబుతున్నారు. సాధారణంగా కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవు. స్ప్రింకర్లతో చల్లబరచకపోతే వేడికి చనిపోతాయి. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు, వాటి నిర్వాహణకు పెద్ద మొత్తం ఖర్చులు పెరగడంతో కోళ్ల ధరలను కూడా పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కోడి గుడ్డు ధర కూడా పెరిగింది. రూ.4.50 ఉండే గుడ్డు రూ.6.50  నుంచి రూ.7.50 వరకు చేరుకుంది.