హైదరాబాద్కు నీటి కష్టాలు: 2050లో తాగునీళ్లకు కష్టమే.. 2.08 కోట్లకు చేరుకోనున్న జనాభా

హైదరాబాద్కు నీటి కష్టాలు: 2050లో తాగునీళ్లకు కష్టమే.. 2.08 కోట్లకు చేరుకోనున్న జనాభా
  • కావాల్సింది 1,114 ఎంజీడీలు
  • ఇప్పటికే 253 ఎంజీడీల కొరత
  • 2035 నుంచి నీటి కష్టాలు షురూ
  • కొత్త వనరుల కోసం వాటర్ బోర్డు అన్వేషణ 

 హైదరాబాద్​సిటీ, వెలుగు: కోర్​అర్బన్​రీజియన్​(క్యూర్​)గా విస్తరించిన గ్రేటర్​హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి అవసరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. భవిష్యత్​లో నీటి అవసరం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై వాటర్​బోర్డు స్పెషల్​గా ఓ నివేదికను సిద్ధం చేసింది.

2050 టార్గెట్​గా 25 ఏండ్లలో నగర జనాభా ఎంత ఉంటుంది? ఎంత నీటి అవసరం ఉంటుందన్నదానిపై అధికారులు అధ్యయనం చేశారు. జనాభా పెరుగుదల, నీటి సరఫరా పెరుగుదలపై అంచనాలు తయారు చేశారు.  

2050 నాటికి 1114 ఎంజీడీలు..

ప్రస్తుతం గ్రేటర్ లో1.30 కోట్ల జనాభాకు రోజుకు 813.28 ఎంజీడీల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం వాటర్​బోర్డు 560 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. ఈ లెక్కన లోటు 253.28 ఎంజీడీలుగా ఉంది. అయితే, 2027 ఆఖరు నాటికి సిటీలో జనాభా1.57 కోట్లకు చేరుకుంటుందని, అప్పుడు నీటి డిమాండ్​ 835 ఎంజీడీలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. అప్పటి వరకు గోదావరి 2, 3 దశలు పూర్తయితే 869 ఎంజీడీలు సమకూరుతుందని, ఇంకా 34 ఎంజీడీల మిగులు ఉంటుందంటున్నారు. 2030 నాటికి జనాభా 1.60 కోట్లకు చేరితే నీటి డిమాండ్​867.28 ఎంజీడీలకు చేరుకుంటుందని, అప్పటికీ సరఫరా సామర్థ్యం 869 ఎంజీడీలు ఉంటుందన్నారు. అయినా,1.72 ఎంజీడీల మిగులు ఉంటుందన్నారు. ఇక 2035 నాటికి జనాభా 1.73 కోట్లు.. డిమాండ్​ 921.05 ఎంజీడీలు ఉంటుందని, సరఫరా సామర్థ్యం 869 ఎంజీడీలు కొనసాగుతుందని, అప్పుడు మాత్రమే 52.05  ఎంజీడీల కొరత ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 

2050 నాటికి నగర జనాభా 2.08 కోట్లకు చేరుతుందని భావిస్తుండగా నీటి డిమాండ్​రోజుకు 1,114.02 ఎంజీడీలు ఉంటుందని అంచనా వేశారు. అప్పుడు సరఫరా చేసే సామర్థ్యం మైనస్​ 71 ఎంజీడీలకు పడిపోతుందని భావిస్తున్నారు. అప్పటి వరకూ ఇప్పుడు అనుకున్న అన్ని ప్రాజెక్టులు పూర్తయినా నీటి కొరత ఉంటుందని, అందుకని కొత్త వనరుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని అధికారులు
 చెబుతున్నారు. 

పొదుపుగా వాడాలి..

నగరం దక్కన్​ఏరియా కావడం వల్ల నీటి వనరులు తక్కువగానే ఉన్నాయి. మన దగ్గర హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డిలో సింగూరు, మంజీరా, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, ​పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పైప్​లైన్​ ద్వారా నీటిని తరలిస్తున్నారు. 

2050 నాటికి ఊహించిన దానికన్నా జనాభా విస్పోటనం ఉంటే నీటి కొరతతో ఇబ్బంది తప్పకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే కొత్త ప్రాజెక్టులు ఏం చేపట్టాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. అలాగే, నీటి పొదుపుపై ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.