గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ అకౌంట్‍ ఖాళీ!

గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ అకౌంట్‍ ఖాళీ!
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక అంతా ఆగమాగం
  • కేసీఆర్‍ చెప్పిన ఏటా రూ.300 కోట్లు వస్తలేవ్​
  • కేటీఆర్‍ చెప్పిన 250 కోట్లలో వచ్చినయ్​ 50 కోట్లే
  • ఎక్కడికక్కడ ఆగిపోతున్న పనులు
  • లెక్క తప్పుతున్న గ్రేటర్‍  జంబో బడ్జెట్‍ అంచనాలు 
  • సొంత ఆదాయం కూడా అంతంత మాత్రమే


వరంగల్‍, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్‍ మున్సిపల్​ కార్పొరేషన్​ తర్వాత అంతే పెద్ద సిటీగా చెప్పుకునే గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ అకౌంట్‍ ఖాళీ అయింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీల ప్రకారం స్పెషల్‍ ఫండ్స్  రావాల్సి ఉన్నా రాలేదు. నిధుల కోసం ఎన్నిసార్లు రెక్వెస్ట్ పెట్టినా ఫాయిదా లేదు. పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు జంబో బడ్జెట్‍ ప్రవేశపెట్టగా.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. సగం కూడా పన్నులు వసూలు కాలేదు.


మొత్తంగా వరంగల్​ బల్దియా ఖాతాలో పైసల్లేవ్. దీంతో కాంట్రాక్టర్లకు కొన్ని నెలలుగా బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ఇప్పుడు వేలాది మంది సిబ్బందికి టైమ్​కు జీతాలు ఇవ్వడం లేదు. వరంగల్‍ నగరంపై ఎంతో ప్రేముందని చెప్పిన సీఎం కేసీఆర్‍ మొదలు, మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తామిచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందన్న విమర్శలు వస్తున్నాయి.

బిల్లులకు, జీతాలకు తక్లీఫ్​

గ్రేటర్‍ వరంగల్​ కార్పొరేషన్‍ అకౌంట్​లో  సరిపడా ఫండ్స్ లేకపోవడంతో వరంగల్‍ ట్రైసిటీ పరిధిలో చేపట్టిన పనులపై ఎఫెక్ట్ పడింది. హనుమకొండ పరిధిలో 200 మంది కాంట్రాక్టర్లు సివిల్‍ వర్క్స్​చేపట్టగా.. నెలల తరబడి పనులకు సంబంధించి సీఎం అష్యూరెన్స్ బిల్లులు ఇవ్వలేదు. డిసెంబర్‍లో కాంట్రాక్టర్లు పనులు బంద్‍ చేసి సమ్మె చేపట్టారు. పెండింగ్‍ బిల్లులు క్లియర్‍ చేస్తే తప్ప పనులు చేయబోమని ధర్నాలకు దిగారు. దీంతో సిటీలో నడుస్తున్న మేజర్‍ పనులు ఆగాయి. ఇదిలా  ఉండగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఇప్పుడు సిబ్బందికి కావాల్సిన జీతాలకు కూడా డబ్బులు  ఉంటలేవు. గతంలో మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే సంప్రదాయం ఉండగా.. ఈసారి ఫండ్స్ లేక రెండో వారం నుంచి సర్దుబాటు చేస్తున్నారు.  బల్దియా అకౌంట్​లో డబ్బులు లేకపోవడం, ప్రభుత్వ పెద్దల హామీ ప్రకారం నిధులు ఇవ్వకపోవడంతో నెలనెలా ఏదో ఒక సమస్యతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రగతి ఫండ్స్​ను ఎమర్జెన్సీ పేమెంట్ల కోసం వాడుకునేలా అప్రూవల్‍ ఇవ్వాలని గ్రేటర్ వరంగల్​ కమిషనర్‍ ప్రావీణ్య రెక్వెస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి రూ.6 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఫైనాన్స్​ డిపార్టుమెంట్‍కు అర్జి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించకపోతే  రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా సమస్య నెలకొనే అవకాశం ఉంది. మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ గత రెండు పర్యటనల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. త్వరలో ఆయన మరోసారి వరంగల్‍ సిటీ రానున్నారు. దీంతో కేటీఆర్​ రాక, హామీల అమలుపై గ్రేటర్‍ వరంగల్​ అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రూ.100 కోట్ల పెండింగ్‍ బిల్లులు ఇప్పించండి: కాంట్రాక్టర్లు

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో తాము చేసిన పనులకు సంబంధించి రూ.100 కోట్లు సర్కారు పెండింగ్​ పెట్టిందని, ఆ బిల్లలును ఇప్పించాలని మున్సిపల్‍ సెక్రటరీ అరవింద్‍ కుమార్‍ను హనుమకొండ కాంట్రాక్టర్స్​ అసోసియేషన్‍ నేతలు కోరారు. బుధవారం హనుమకొండ కలెక్టర్‍లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బిల్లులు రూ.కోట్లలో రావాల్సి ఉంటే.. నాలుగైదు లక్షలు ఇస్తున్నారని, బిల్లులు లేటుగా ఇవ్వడంవల్ల అప్పుల పాలవుతున్నామని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు.


కేసీఆర్​, కేటీఆర్​ హామీలెటుపాయె..?

గ్రేటర్ వరంగల్‍ డెవలప్‍మెంట్‍, ఫండ్స్ విషయంలో సీఎం కేసీఆర్‍, మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ ఇచ్చిన హామీలు  మాటలకే పరిమితమయ్యాయి. 2016 జనవరిలో సీఎం వరంగల్‍ సిటీ పర్యటన సందర్భంగా వరంగల్‍ డెవలప్‍మెంట్ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రెగ్యులర్‍ ఫండ్స్​తో సంబంధం లేకుండా ఏటా రూ.300 కోట్ల చొప్పున నిధులిస్తామని మాటిచ్చారు. 2021 గ్రేటర్‍ వరంగల్‍ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్‍ కూడా వరంగల్‍ సిటీ డెవలప్‍మెంట్‍ బాధ్యత తనదే అని చెప్పారు. వందల కోట్లు ఇస్తామన్నారు. ఏడాది గడిచినా అవి రాలేదు. 2022 ఏప్రిల్​లో కేటీఆర్‍ మరోసారి వరంగల్‍ సిటీకి వచ్చి,పెండింగ్‍ పనులపై రివ్యూ నిర్వహించారు. వెంటనే రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాగా, 10 నెలలు గడిచాక చూస్తే అందులో రెండు నెలల కింద రూ.50 కోట్లు తప్ప మిగతా రూ.200 కోట్లు రాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగాయి.


గ్రేటర్‍ వరంగల్​ బడ్జెట్‍ అంచనాలు తలకిందులు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నిధులు కేటాయించకపోవడంతో ఏటా గ్రేటర్‍ వరంగల్​ కార్పొరేషన్‍ అధికారులు రూపొందిస్తున్న బడ్జెట్‍ అంచనాలు తలకిందులవుతున్నాయి. 2020-–2021లో రూ.305 కోట్ల వాస్తవిక బడ్జెట్‍ ఉండగా, ప్రభుత్వం గ్రేటర్‍ వరంగల్​ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని 2021–-2022 బడ్జెట్‍ను రూ.559 కోట్ల 77 లక్షలకు పెంచింది. గతేడాది దీనిని రూ.609.47 కోట్లకు పెంచి మళ్లీ రూ.606 కోట్ల 80 లక్షలకు సవరించారు. కేసీఆర్‍, కేటీఆర్‍ చెప్పినట్లు స్పెషల్‍ ఫండ్స్​ ఉంటుందనే ఆశతో 2022-–2023 బడ్జెట్‍లో రూ.606 కోట్లలో.. రూ.411 కోట్ల 95 లక్షలు కేంద్ర, రాష్ట్ర గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేశారు. కానీ రాలేదు. దీనికితోడు సొంత ఆదాయం విషయంలోనూ అంచనా తప్పింది. పన్నుల రూపంలో బల్దియాకు రూ.200 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ.80 నుంచి 85 కోట్లకే పరిమితమైంది. సెంటర్‍ ఫర్‍ గుడ్‍ గవర్నెన్స్ వెబ్‍సైట్‍లో టెక్నికల్ సమస్య వల్ల పన్నుల వసూళ్లు ఆశించినమేర జరగడంలేదు. దీంతో గతానికి భిన్నంగా అంతోఇంతో ఎక్కువ అమౌంట్​ కనిపించే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గ్రేటర్‍ కార్పొరేషన్‍ అకౌంట్ ఖాళీ అయింది.

అప్పులు తెచ్చి పనులు చేస్తున్నం

గ్రేటర్‍ వరంగల్​ కార్పొరేషన్‍ పరిధిలో సివిల్‍ వర్క్స్​ చేసినం. రూ.100 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నయ్‍. అప్పులు తెచ్చి పనులు చేస్తుంటే ప్రభుత్వం బిల్లులు లేట్‍ చేస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో పనులు ఆపి ధర్నాలకు దిగినం. కోట్ల రూపాయలు పెండింగ్‍ ఉంటే రూ.5 లక్షలలోపు ఇచ్చిన్రు. 
నా బిల్లులు రూ.3 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.10 లక్షలు ఇచ్చారు. 
- కొరివి రాజారావు, కాంట్రాక్టర్‍


పట్టణ ప్రగతి ఫండ్స్​ నుంచి జీతాలు ఇచ్చినం

ఈ నెల జీతాలు లేట్‍ అయినమాట వాస్తవమే. సీజీజీ వెబ్‍సైట్‍లో టెక్నికల్ సమస్య వల్లే ఇబ్బంది తలెత్తింది. ప్రభుత్వ అనుమతితో పట్టణ ప్రగతి నిధుల నుంచి జీతాలు ఏర్పాటు చేసినం. పన్నుల రూపంలో ఇప్పటివరకు రూ.80 కోట్లు వచ్చినయ్​. వచ్చే నెలలో స్పెషల్‍ టీంల ద్వారా మిగతా టార్గెట్‍ కంప్లీట్‍ చేస్తం. కాంట్రాక్టర్ల పెండింగ్‍ బిల్లుల అంశం పైఅధికారుల దృష్టిలో ఉంది. 
- రషీద్‍, గ్రేటర్‍ డిప్యూటీ కమిషనర్‍