కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలో బిచ్చగాళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు నగరవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి గుర్తించిన వారిని స్మైల్ కేంద్రంలో చేర్పించాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమారంలో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో హెల్త్ కేర్ సొసైటీ ఎన్‌జీవో ద్వారా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అందుతున్న వసతులు, భోజనం, వైద్య సేవలు, పునరావాస చర్యలను పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులు తదితరులను గుర్తించి వారిని కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోమ్‌లో ఉంచి, ఆ తర్వాత వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం ద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవితం కల్పించాలన్నారు. విజయవంతంగా అమలయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నగరాన్ని సామాజిక బాధ్యతతో కూడిన, మానవీయ నగరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఉప కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్‌వో రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
