శానిటేషన్ సిబ్బంది శ్రేయస్సుకు కృషి చేస్తాం : మేయర్ సుధారాణి

శానిటేషన్ సిబ్బంది శ్రేయస్సుకు కృషి చేస్తాం : మేయర్ సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్​ వరంగల్​ పరిధిలోని పనిచేసే శానిటేషన్​ సిబ్బంది శ్రేయస్సుకు కృషి చేస్తామని బల్దియా మేయర్ సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్​లో మేయర్​ కమిషనర్​ చాహత్​ బాజ్​పాయ్​తో కలిసి శానిటేషన్ సిబ్బందికి స్వెట్లర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ చలి కాలంలో రక్షణ కోసం ప్రతి ఏడాది సిబ్బందికి స్వెట్టర్లను అందజేస్తున్నామన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రైవేట్ ఆస్పత్రుల సమన్వయంతో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 వర్షాకాలంలో రెయిన్ కోట్లతోపాటు వేసవి కాలంలో క్యాప్ లు, వ్యక్తిగత రక్షణకు పీపీఈ కిట్లను అందజేసినట్లు గుర్తుకు చేశారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్, కమిషనర్​ కలిసి కేక్​ కట్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ వో రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఎంహెచ్ వో రాజేశ్, శానిటరీ సూపర్ వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను, శానిటేషన్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.