హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్

హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో
  • రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు
  • భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ, అధికారులు సీఎంవోకు ఫైల్ పంపించినట్టు తెలిసింది. దీని ప్రకారమే భవిష్యత్ లో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు. 

ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది.  తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలు అవుతోంది. గ్రూప్ 1లో మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే, దీంట్లో 225 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి హారిజంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా 2007లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజేశ్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు హారిజంటల్  విధానం అమలు చేయాలని ఆదేశాలిచ్చినట్టు గుర్తుచేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పును ఎవ్వరూ పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజంటల్  విధానంపై చర్చ మొదలైంది. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజెంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్​పీఎస్సీ తెలిపినా.. అప్పటి బీఆర్​ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. హారిజంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్​ను టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది. త్వరలోనే హారిజంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే, అన్ని రిక్రూట్మెంట్లలోనూ కదలిక రానున్నది. 

కొత్త రోస్టర్​ ఎట్లుంటుందో?

తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్​మెంట్ పై దృష్టిపెట్టింది. అయితే, దీనికి అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానున్నది. తాజాగా కొత్త రోస్టర్​ను అధికారులు తయారుచేసి, సీఎం ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు పది పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో ఆరు పోస్టులు ఉమెన్స్​కు రిజర్వు చేశారు. దీంతో పాటు మరో మూడు ఓసీ, ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టినా.. దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది. 

ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, ఈ విధానానికి స్వస్తి పలుకనున్నారు. హారిజంటల్ కొత్త విధానంలో మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఏపీలో 2016 నుంచే హారిజంటల్ విధానం అమలు చేస్తుండగా, తాజాగా దాన్ని మార్చి చేసింది. దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ల రోస్టర్​ పూర్తిగా తీసేసి, భర్తీ చేసే పోస్టుల్లో 33% అమలు చేస్తున్నారు. అయితే,తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది త్వరలోనే స్పష్టత రానున్నది.