సంగమేశ్వరం పనులను తనిఖీ చేయండి

సంగమేశ్వరం పనులను తనిఖీ చేయండి
  • సంగమేశ్వరం పనులను తనిఖీ చేయండి
  • కేఆర్‌ఎంబీకి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశం
  • తనిఖీలతో రాజకీయ దుమారం లేస్తుందన్న ఏపీ
  • ప్రాజెక్టు పరిశీలన జరగాల్సిందేనన్న ఎన్‌జీటీ

హైదరాబాద్‌‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం పనులను తనిఖీ చేయాలని కేఆర్‌‌ఎంబీని ఎన్‌‌జీటీ ఆదేశించింది. గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ ఆదేశాల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చి రిపోర్టు ఇవ్వాలని సూచించింది. నారాయణపేట జిల్లా బాపన్‌‌పల్లికి చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌‌ను ఎన్‌‌జీటీ చెన్నై బెంచ్‌‌ జ్యుడీషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌ రామకృష్ణన్‌‌, ఎక్స్‌‌పర్ట్‌‌ మెంబర్‌‌ సత్యగోపాల్‌‌ శుక్రవారం విచారించారు. కేఆర్‌‌ఎంబీ, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన బెంచ్.. సంగమేశ్వరం పనులను ఎందుకు తనిఖీ చేయలేదని కేఆర్‌‌ఎంబీ అడ్వకేట్‌‌ను ప్రశ్నించింది. ప్రాజెక్టు విజిట్‌ చేయడానికి నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా సహకరించడం లేదని కేఆర్‌ఎంబీ లాయర్ తెలిపారు. దీంతో బెంచ్ స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేఆర్‌‌ఎంబీ ఏర్పాటు చేసిన టీం స్వయంగా వెళ్లి పనులు పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పింది.

మాకు ఆమోదయోగ్యం కాదు..: ఏపీ
ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ వెంకటరమణ జోక్యం చేసుకుని.. కృష్ణా బోర్డు నేరుగా వచ్చిన తనిఖీలు చేయడం తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టు తనిఖీలతో రాజకీయ దుమారం లేస్తుందన్నారు. దీనికి ఎన్‌‌జీటీ బెంచ్ స్పందిస్తూ.. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ప్రాజెక్టును తనిఖీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు విజిట్‌‌ చేసేందుకు సహకరించడం లేదని.. హెలికాప్టర్ ద్వారా తనిఖీలు చేయాలని తెలంగాణ ఏఏజీ రామచందర్‌‌రావు కోరారు. హెలికాప్టర్‌‌ ఖర్చులు తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. కేఆర్‌‌ఎంబీ టీమ్​ సొంతగా వెళ్లి ప్రాజెక్టును పరిశీలించాలని, ఆగస్టు 9లోగా నివేదిక ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.

సర్వే మాత్రమే చేస్తున్నమని ఏపీ అఫిడవిట్‌‌
రాయలసీమ ఎత్తిపోతల కోసం సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని, ప్రాజెక్టు నిర్మించట్లేదని ఏపీ మరోసారి ట్రిబ్యునల్‌‌కు చెప్పింది. ఏపీ సీఎస్‌‌ ఆదిత్యనాథ్ దాస్‌‌ ఈ మేరకు ఎన్‌‌జీటీలో అఫిడవిట్‌‌ ఫైల్‌‌ చేశారు. శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని తీసుకోవడానికే కొత్త లిఫ్ట్‌‌ స్కీం చేపట్టామని తెలిపారు. శ్రీశైలం లో 854 అడుగులకు నీటి మట్టం చేరితే గాని పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి నీటిని తీసుకోలేమని, కాబట్టి కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి వస్తోందని వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌‌ కేఆర్‌‌ఎంబీకి సమర్పించామని.. పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశామని తెలిపారు. ప్రాజెక్టుకు కొత్తగా భూసేకరణ, కొత్తగా స్టోరేజీ అవసరం లేదన్నారు. ప్రాజెక్టును ముచ్చుమర్రి వద్ద చేపట్టాలని అనుకున్నా భూ సేకరణ, ఇతర సమస్యలతో పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌కు ఉత్తరం వైపున నిర్మించేలా సర్వే పనులు చేస్తున్నామని తెలిపారు. సర్వే మినహా ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని, గవినోళ్ల శ్రీనివాస్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కొట్టేయాలని అఫిడవిట్‌‌లో విజ్ఞప్తి చేశారు.

శ్రీశైలం రిజర్వాయర్‌‌లో భారీ కాల్వ తవ్వకం
సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంకు నీటిని అందించేందుకు శ్రీశైలం రిజర్వాయర్‌‌లో ఏపీ ప్రభుత్వం భారీ కాలువ తవ్వుతోంది. 400 మీటర్ల వెడల్పు, 80 మీటర్ల లోతుతో భారీ అప్రోచ్‌‌ చానల్‌‌ తవ్వకం పనులు వేగంగా కొనసాగిస్తోంది. రిజర్వాయర్‌‌లో 8.89 కి.మీ.ల పొడవైన కాలువ తవ్వకం పనులను వందలాది ఎస్కవేటర్లతో శరవేగంగా చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్‌‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ప్రాజెక్టు లోపల ఉన్న ఎస్కవేటర్లు, పొక్లెయిన్లు, టిప్పర్లు, ఇతర యంత్ర సామగ్రిని బయటికి తెచ్చినట్టు తెలిసింది.

గోదావరి, కృష్ణా బోర్డులకు చెరో రూ.200 కోట్లు ఇవ్వండి
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు లేఖ 
గోదావరి, కృష్ణా బోర్డుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కేఆర్‌‌ఎంబీ, జీఆర్‌‌ఎంబీ కోరాయి. ఈ మేరకు శుక్రవారం జీఆర్‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ సెక్రటరీ బీపీ పాండే, కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ హరికేశ్‌‌ మీనా తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఏపీ సెక్రటరీ శ్యామలరావులకు లెటర్‌‌‌‌ రాశారు. బోర్డుల జ్యూరిస్‌‌డిక్షన్‌‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేసిన 60 రోజుల్లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు జమ చేయాల్సి ఉందని తెలిపారు. వెంటనే ఈ నిధులను బోర్డుకు ఇవ్వాలని వారు కోరారు.