నూక్(గ్రీన్ లాండ్): అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని.. తాము అమెరికాతో కలవబోమని గ్రీన్ లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ తేల్చిచెప్పారు. గ్రీన్ లాండ్ ప్రజలు డెన్మార్క్ కింగ్ డమ్ లో భాగంగానే ఉంటారన్నారు. బుధవారం డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో ఆ దేశ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ తో భేటీ అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ లో నీల్సన్ మాట్లాడారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేస్తున్న బెదిరింపులు పూర్తిగా అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు.
‘‘మేం ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. అమెరికా లేదా డెన్మార్క్ లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. మేం డెన్మార్క్నే ఎంపిక చేసుకుంటాం. డెన్మార్క్ కింగ్ డమ్లోనే ఉండాలని నిర్ణయించుకుంటాం” అని ఆయన ప్రకటించారు. బుధవారం వాషింగ్టన్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో డెన్మార్క్, గ్రీన్ లాండ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగాల్సి ఉండగా, అంతకుముందే నీల్సన్ తమ వైఖరిని ఇలా స్పష్టం చేశారు. అయితే, నీల్సన్ ప్రకటన తర్వాత ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘‘అది వారి సమస్య. ఆయనతో నేను ఏకీభవించను. ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఇది ఆయనకు చాలా పెద్ద సమస్యగా మారబోతోంది” అని ట్రంప్ హెచ్చరించారు.
వనరులు కొల్లగొట్టేందుకే..
సుమారు 57 వేల మంది జనాభా ఉన్న గ్రీన్ లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ లో సెమీఅటానమస్ భూభాగంగా కొనసాగుతోంది. గ్రీన్లాండ్ నేతలతోపాటు ప్రజలు కూడా అమెరికాలో చేరేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ‘బ్లూమ్ బర్గ్’ మీడియా సంస్థ వెల్లడించింది. భద్రతా సాకుతో గ్రీన్లాండ్లోని క్రిటికల్ మినరల్స్, సహజ వనరులను కొల్లగొట్టేందుకే ట్రంప్ ఈ డ్రామా ఆడుతున్నారని గ్రీన్లాండర్స్ భావిస్తున్నట్టు వివరించింది.
