సీతమ్మసాగర్, గౌరవెల్లిపై 11న సమావేశం

సీతమ్మసాగర్, గౌరవెల్లిపై 11న సమావేశం

హైదరాబాద్, వెలుగు : సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై తెలంగాణ ఇరిగేషన్​ఇంజినీర్లతో గోదావరి రివర్​మేనేజ్​మెంట్ (జీఆర్​ఎంబీ)​బోర్డు ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేసింది. ఈమేరకు తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గౌరవెల్లి రిజర్వాయర్, సీతమ్మ సాగర్​ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. తుది అనుమతులు తీసుకునే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పనులు ఆపేశారో లేదో పర్యవేక్షించేందుకు వర్క్​సైట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది. 

ఈనేపథ్యంలో ఈనెల 11న 3 గంటలకు జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్​ ఎంకే సిన్హా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కరీంనగర్​ఈఎన్సీ శంకర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్​రెడ్డికి సమాచారం ఇచ్చారు. సీతమ్మ సాగర్​బ్యారేజీ, మల్టీ పర్పస్​ప్రాజెక్టు పనుల పరిశీలనకు జీఆర్ఎంబీతో పాటు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారితో కమిటీ ఏర్పాటు చేశారు. 

ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇరిగేషన్​ఇంజినీర్లతో బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఆయా ప్రాజెక్టుల పనుల ప్రోగ్రెస్, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏమైనా పనులు చేశారా? ప్రస్తుతం ఆయా వర్క్​సైట్లలో ఏమైనా పనులు చేస్తున్నారా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? వాటి పుటేజీ తాము ఎలా తీసుకోవాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.