అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0.. 13 శాతం తగ్గనున్న కిరాణా బిల్లు

అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0.. 13 శాతం తగ్గనున్న కిరాణా బిల్లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 వల్ల కిరాణా, నిత్యావసరాలపై కుటుంబాల నెలవారీ ఖర్చులో 13 శాతం ఆదా అవుతుంది. ఒక చిన్న కారు మీద రూ.70 వేల వరకు ఆదా చేసుకోవచ్చని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఈ సంస్కరణల వల్ల 375 రకాల వస్తువుల ధరలు తగ్గాయి. ఇందులో కిరాణా, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, మందులు, వెహికల్స్​ ఉన్నాయి. ఈ సంస్కరణను ప్రధాని నరేంద్ర మోదీ 'జీఎస్టీ బచత్ ఉత్సవ్'గా అభివర్ణించారు. స్టేషనరీ, దుస్తులు, చెప్పులు, మందుల కొనుగోళ్లపై 7-12 శాతం ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల మీద 18 శాతం వరకు ఆదా అవుతుంది. 1,800 సీసీ వరకు ఉన్న ట్రాక్టర్ల మీద రూ.40 వేల ఆదా ఉంటుందని అంచనా. బైకులు, స్కూటర్ల (350 సీసీ వరకు) మీద రూ.ఎనిమిది వేలు, 32 అంగుళాల కంటే పెద్ద టీవీపై రూ.3,500 ఆదా చేసుకోవచ్చు. ఏసీల మీద రూ.2,800 వరకు ఆదా అవుతుంది. సోమవారం నుంచి జీఎస్టీ రెండు శ్లాబుల వ్యవస్థగా మారింది. చాలా వస్తువులు, సేవల మీద 5 శాతం, 18 శాతం పన్ను విధిస్తారు. విలాసవంతమైన వస్తువులపై 40 శాతం పన్ను వేస్తారు.