పెరుగుతున్న పన్ను వసూళ్లు

పెరుగుతున్న పన్ను వసూళ్లు

ఈ ఏడాది 31 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
రూ.10.54 లక్షల కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్  వ్యక్తిగత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆదాయాలు) 30.69 శాతం పెరిగి రూ.10.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌‌‌‌తో సహా) వసూళ్లు 41 శాతం పెరగగా, కార్పొరేట్ పన్ను రాబడులు 22 శాతం పెరిగాయి. దీనిని బట్టి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్టు చెప్పవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. పన్ను వసూలు అనేది ఏ దేశంలోనైనా ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయంపై వసూలు చేసే పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పిలుస్తారు.

పరోక్ష పన్నుల విషయానికొస్తే, ఈ ఏడాది అక్టోబర్‌‌లో జీఎస్టీ రాబడులు 16.6 శాతం పెరిగి దాదాపు రూ. 1.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లలో రెండవది. ఈ విషయమై డెలాయిట్ ఇండియా పార్ట్​నర్​ గోకుల్ చౌదరి మాట్లాడుతూ, “బలమైన పన్నుల వసూళ్లు పబ్లిక్ ఫైనాన్స్‌‌ను పెంచుకోవడానికి సాయపడతాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదనడానికి ఈ లెక్కలు రుజువు. జీఎస్టీ , కార్పొరేట్ పన్ను రేటు, పోటీతత్వం వంటి పన్ను సంస్కరణల వల్ల బలమైన ఆదాయం వస్తోంది” అని ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు విలువ (నెట్​ ఆఫ్​ రీఫండ్స్​) రూ. 8.71 లక్షల కోట్లుగా ఉంది.

ఇది గత ఏడాది ఇదే కాలంలోని నికర వసూళ్లు కంటే 25.71 శాతం ఎక్కువ. ఈ వసూళ్లు 2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో 61.31 శాతం. ఈ ఏడాది నవంబర్ 10  వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు, స్థూల వసూళ్ల విలువ రూ. 10.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలానికి సంబంధించిన స్థూల వసూళ్ల కంటే 30.69 శాతం ఎక్కువ. రీఫండ్‌‌లను సర్దుబాటు చేసిన తర్వాత, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో నికర వృద్ధి 24.51 శాతంగా ఉంది.  వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వసూళ్లలో 28.06 శాతంగా (పిఐటి మాత్రమే) ఉంది.

14.20 లక్షల కోట్లు టార్గెట్​

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 14.20 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం  రూ. 14.10 లక్షల కోట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా అక్టోబర్‌‌లో జీఎస్టీ రాబడులు రూ. 1.52 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక వసూళ్లలో రెండవది. ఏప్రిల్‌‌లో జీఎస్‌‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్‌‌లో ఆదాయం రూ.1.30 లక్షల కోట్లకుపైగా ఉంది. 2022 అక్టోబర్  నెలలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ రూ. 1,51,718 కోట్లు, ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 26,039 కోట్లు, స్టేట్​ జీఎస్టీ రూ. 33,396 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 81,778 కోట్లు  సెస్ రూ. 10,505 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 825 కోట్లతో సహా) ఉంది.