మేడిగడ్డ బ్యారేజీ వద్ద నేలకు టెస్టులు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద నేలకు టెస్టులు
  •  ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు
  • వాటి రిపోర్టులను వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీపై ఇంజనీరింగ్​ అధికారులు బ్యారేజీ ప్రదేశంలో మరిన్ని టెస్టులు చేస్తున్నారు. నేల పరిస్థితులను అంచనా వేసే పరీక్షలు చేస్తున్నారు. గత నెలలో బ్యారేజీని పరిశీలించిన నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల కమిటీ.. బ్యారేజీల వద్ద మరిన్ని టెస్టులు చేయాలని సూచించింది. బ్యారేజీ కుంగడానికి డిజైన్ల లోపమా లేదా అక్కడి నేల పరిస్థితులా అన్నది తేల్చేందుకు టెస్టులు చేయాలని ఆదేశించింది. జియోఫిజికల్​ టెస్టులతో పాటు ఎలక్ట్రికల్​ రెసిస్టివిటీ టెస్టు, జియో పెనట్రేషన్​ రెసిస్టివిటీ పరీక్షలు  చేయాలంది.

దీంతో బ్యారేజీ ఎగువ, దిగువన టెస్టులు చేస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎగువన ఇప్పటికే టెస్టులు పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్యారేజీ దిగువన టెస్టులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ టెస్టులు పూర్తిచేసి రిపోర్టులు పంపాలని ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆ టెస్టులు త్వరగా పూర్తి చేసి రిపోర్టులు పంపిస్తే.. వాటిలో పేర్కొన్న అంశాలు, నిపుణుల కమిటీ పరిశీలించిన అంశాల ఆధారంగా ఎన్​డీఎస్​ఏ రిపోర్టును తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, బ్యారేజీకి సంబంధించి నివేదికను త్వరగా ఇవ్వాల్సిందిగా ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు తెలిసింది. మరో 2 నెలల్లో ఫ్లడ్​ సీజన్​ ప్రారంభం కానున్నందున ఆ రిపోర్టు ఆధారంగానే చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది.