
రెక్కలు తెగి ఎగరలేని చిలుకకు ట్రాన్స్ ప్లాంట్ ద్వారా ట్రీట్ మెంట్ చేసి తిరిగి ఎగరటం నేర్పింది ఓ లేడి డాక్టర్. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరిగింది. 12 వారాల వయస్సున్న ఓ రామచిలుకను దాని యజమాని ఎగురనివ్వకుండా రెక్కలు కట్ చేశాడు. అయినా ఆ చిలుక తరచూ ఎగిరేందుకు ప్రయత్నించేది. ఈ ప్రయత్నంలో అది కింద పడిపోయి గాయాలపాలయ్యింది.
ఆసుపత్రిలో ఆ రామచిలుకను పరీక్షించిన డాక్టర్ క్యాథరీన్ అపులీ దానికి ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా చికిత్సనందించింది. ఆ చిలుక రెక్కలను ట్రాన్స్‌ప్లాంట్ చేయించేందుకు కొన్ని గంటల సమయం పట్టిందని, అందుకోసం కొన్ని పక్షి రెక్కలు, గ్లూ, టూత్‌పిక్స్, కాటన్ వంటివాటిని ఉపయోగించానని క్యాథరీన్ తెలిపింది. ఇలా రెక్కలు అమర్చిన కొద్దిగంటల్లోనే ఆ చిలుక కాస్త శక్తి పుంజుకున్నదని , ఆ తర్వాత దానికి నెమ్మది నెమ్మదిగా ఎగరటం నేర్పించానని చెప్పింది. ఆ చిలుకకు ‘వెయీ-వెయీ‘ అనే పేరు పెట్టానని, అసలే ఎగరాలన్న తపన ఉన్న ఆ రామచిలుకకు మరింత ప్రోత్సాహం లభించటంతో అతి తక్కువ సమయంలోనే ఎగరగలిగిందని చెప్పారు. ఆకాశంలోకి ఎగిరి సురక్షితంగా నేల మీదకు దిగిందని క్యాథరీన్ తెలిపింది.

