పంటలు చేతికొచ్చె.. కొనే దిక్కు లేకపాయె

పంటలు చేతికొచ్చె.. కొనే దిక్కు లేకపాయె
  • కంది, పల్లీ, శనగ రైతుల పరేషాన్​
  • కేంద్రం చెప్పినా కొనుగోళ్లు షురూజేయని మార్క్​ఫెడ్​
  • బయటనే మస్తు ధరకు కొంటున్నారని ఆఫీసర్ల నిర్లక్ష్యపు సమాధానం
  • అగ్గువ సగ్గువకే కొంటున్న వ్యాపారులు
  • వాళ్లకు అమ్మితే లాగోడి పైసలు కూడా వస్తలేవంటున్న రైతులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పంటలు చేతికి వస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లు మొదలు పెట్టడం లేదు. ఇప్పటికే మార్క్‌‌ఫెడ్‌‌  ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా.. చడీ చప్పుడు లేదు. కందులు, పల్లీలు, శనగలు పండించిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి వచ్చినా.. ఎక్కడ అమ్ముకోవాలో వారికి దిక్కు తోచడం లేదు. నిల్వ చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో అగ్గువ సగ్గువకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. ఈ సీజన్​లో 77 వేల టన్నుల కందులను కొనాలని మార్క్‌‌‌‌ఫెడ్​ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నాఫెడ్‌‌‌‌  ఆదేశించింది. 55 వేల టన్నుల శనగలు కొనాలని సూచించింది. గత ఏడాది జనవరిలోనే మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈసారి ఫిబ్రవరి నెలాఖరు వచ్చినా కొనుగోళ్లు మొదలు పెట్టడం లేదు. ఎందుకు కొంటలేరని ప్రశ్నిస్తే.. బయట వ్యాపారుల దగ్గరే ఎక్కువ ధర వస్తోంది కదా అని ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతులు అంటున్నారు. బయట మార్కెట్​లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా అమలవుతలేదని, వ్యాపారులకు అమ్మితే పెట్టుబడులన్నా తిరిగి వస్తలేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు చెప్పిందని కందులు వేస్తే..!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు ఈసారి ఎక్కువ మొత్తంలో కందులు సాగుచేశారు. ప్రతిసారి 7 లక్షల ఎకరాల్లో  సాగు చేస్తే.. ఈసారి సుమారు 11 లక్షల ఎకరాల్లో వేశారు. 7 లక్షల టన్నుల వరకు దిగుబడి రావొచ్చని మొదట ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ, చెడుగొట్టు వానల వల్ల పంటలు దెబ్బతినడంతో 4 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 3 లక్షల టన్నుల కందులు మార్కెట్​కు వచ్చాయి. కానీ,  ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కందులు క్వింటాల్​కు  ఎమ్మెస్పీ రూ. 6 వేలు నిర్ణయించగా.. ఎక్కడా అంత ధర రావడం లేదు. గద్వాల్‌‌‌‌లో రూ. 4,001, సూర్యాపేటలో రూ. 4,275, జగిత్యాలలో రూ. 4,675, తిరుమలగిరిలో రూ. 5,102, నిజామాబాద్‌‌‌‌లో రూ. 5,266, కరీంనగర్‌‌‌‌లో రూ. 5,275, తాండూర్‌‌‌‌ లో  రూ. 5,300, వరంగల్‌‌‌‌లో రూ. 5,386,  వికారాబాద్‌‌‌‌లో రూ. 5,555, కేసముద్రంలో  రూ. 5,609, నారాయణపేటలో రూ. 5,809 పలుకుతోంది.

పల్లికాయకు ఎమ్మెస్పీలో సగం కూడా వస్తలె

రాష్ట్రంలో ఈసారి పల్లిపంట 2.6 లక్షల ఎకరాల్లో సాగైంది. లక్ష టన్నులకుపైగా దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. దాదాపు పంట అంతా చేతికి వచ్చింది. వాటిని తీసుకొని మార్కెట్​కు పోతే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనే దిక్కు లేదని రైతులు అంటున్నారు. పల్లికాయలు క్వింటాల్​కు ఎమ్మెస్పీ రూ. 5,275 ఉండగా.. రైతులను వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. పల్లీలకు బహిరంగ మార్కెట్​లో రూ. 7 వేల వరకు పలుకుతోందని మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఆఫీసర్లు చెప్తున్నా.. అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి ఉంది. వరంగల్‌‌‌‌లో రూ. 2,600, నారాయణపేట్‌‌‌‌లో రూ. 2,800, మహబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌లో రూ. 3,000, పెద్దపల్లిలో రూ. 3,690, గద్వాల్‌‌‌‌లో రూ. 3,816, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ రూ. 4,166 పలుకుతోంది. అదే విధంగా సూర్యాపేట, కేసముద్రం, దేవరకద్ర ఇలా చాలా మార్కెట్లలో రైతులు తక్కువ ధరకు పల్లీలను అమ్ముకునే పరిస్థితి ఉంది.

శనగలూ అగ్గువకే!

రాష్ట్రంలో ఈసారి శనగలు 3.4 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. లక్షన్నర టన్నుల వరకు దిగుబడి రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పంట మార్కెట్​కు వస్తోంది.  శనగలు క్వింటాల్​కు ఎమ్మెస్పీ రూ. 5,100. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించుకొని రైతులను దోచుకుంటున్నారు. తాండూర్‌, వికారాబాద్‌, నారాయణపేట, నిజామాబాద్‌ మార్కెట్లలో రూ. 4,221 నుంచి 4,825 మాత్రమే పలుకుతోంది. సర్కారు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తే తప్ప మద్దతు ధర దొరికే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు.