
హైదరాబాద్ : గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌తో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్ల క్వాలిటీ బయటపడింది. ఏ ఒక్క సెంటర్ కూడా తమ స్టూడెంట్ వంద మార్కులు స్కోర్ చేస్తారని చెప్పలేకపోతున్నాయి. కోచింగ్ సెంటర్లలో చెప్పింది ఒకటైతే పరీక్షలో వచ్చిన క్వశ్చన్స్ మరోలా ఉండడమే ఇందుకు కారణం. వేలాది రూపాయలు వసూలు చేసిన కోచింగ్ సెంటర్లు, కనీసం క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో కూడా అంచనా వేయలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 80 వేల పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ కోసం హైదరాబాద్ బాటపట్టారు. గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలతోపాటు మరికొన్ని పరీక్షల కోసం అడిగినంత ఫీజు కట్టి కోచింగ్ సెంటర్లలో చేరిపోయాయి. సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కోచింగ్ సెంటర్లున్నాయి. ఏడాది కాలంలో వందలాది కొత్త కోచింగ్ సెంటర్లు వెలిశాయి. అయితే వీటిలో గ్రూప్ 1 , గ్రూప్ 2 కోచింగ్ సెంటర్లే ఎక్కువ. ఇవి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. వందలాది మందిని ఒకేచోట పెట్టి, ఫంక్షన్ హాళ్లలోనూ కోచింగ్ ఇచ్చారు.
క్వాలిటీ లేని కోచింగ్ తో అభ్యర్థుల్లో ఆందోళన
గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసి ఖంగుతిన్నారు. ప్రశ్నలన్నీ సిలబస్ నుంచే వచ్చినా సమాధానాలు రాయలేకపోయారు. ఆ ప్రశ్నలను కోచింగ్ సెంటర్లు కవర్ చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు. దాదాపు అన్నీ డైరెక్ట్ క్వశ్చన్లుగానే ఉంటాయన్నట్టు కోచింగ్ ఇచ్చారని, అందుకు భిన్నంగా పేపర్ ఉందని అంటున్నారు. కొందరు అభ్యర్థులు పలు కోచింగ్ సెంటర్ల వాట్సాప్ గ్రూపుల్లో తీవ్రంగా విమర్శించారు. సరైన రిఫరెన్స్ బుక్స్ కూడా అడ్వైజ్చేయలేదని మండిపడుతున్నారు. గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ పూర్తిగా ఆలోచనతోనే చేసే విధంగా ఉందని, పేపర్ ఇలా వస్తే ఎలా టైమ్ ఎలా సెట్ చేసుకోవాలనే విషయాలను కోచింగ్ నిర్వాహకులు సూచించలేదని చెబుతున్నారు. దీంతోనే వంద క్వశ్చన్లు కూడా పూర్తి చేయకముందే టైమ్ అయిపోందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
కోచింగ్ తీరులో మార్పులు
ఊహించని విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ రావడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులెవరూ నోరు మెదపడం లేదు. కటాఫ్ మార్కులనూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కోచింగ్ తీరులో మార్పులు చేస్తున్నారు. షార్ట్, లెన్తీ క్వశ్చన్లకు ఎలా ఆన్సర్ చేయాలనేదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు. సివిల్స్స్థాయిలో గ్రూప్1 ప్రిలిమ్స్ వస్తుందని అంచనా వేయలేదన్నారు.