- సంస్థ సీఈవో వేణుగోపాల్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం టీ-శాట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం మొత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అనుభవం ఉన్న సీనియర్ ఫాకల్టీతో క్లాసుల వీడియోలు రూపొందించామని, ఈ నెల 6వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వీటిని ప్రసారం చేస్తామని తెలిపారు. టీశాట్ నిపుణ చానల్ లో ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. అవే ఎపిసోడ్ లను మరుసటి రోజు ఉదయం 5 గంటల నుంచి10 గంటల వరకు విద్య చానల్ ద్వారా ప్రసారం చేస్తామని వెల్లడించారు. మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ సూచించారు.
