గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాస్టర్ క్వశ్చన్​ పేపర్​ ఒక్కదానికే ‘కీ’ రిలీజ్

 గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాస్టర్ క్వశ్చన్​ పేపర్​ ఒక్కదానికే ‘కీ’ రిలీజ్
  • ఓఎంఆర్ షీట్లనూ ఇవ్వనున్న టీఎస్​పీఎస్సీ  
  •  ‘కీ’లో అభ్యంతరాలకు వారం రోజుల టైమ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్​పీఎస్సీ అధికారులు శనివారం రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 503 పోస్టుల భర్తీ కోసం 16న జరిగిన గ్రూప్1 పరీక్షకు 2,86,021 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరందరి ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రిలిమినరీ ‘కీ’తో పాటు ఓఎంఆర్ షీట్లనూ టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్లో పొందుపర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గ్రూప్1 ప్రిలిమ్స్ ఈసారి సెట్స్ రూపంలో కాకుండా, నెంబర్ సిరీస్ రూపంలో ఇచ్చారు. దీంతో ఒక్కో సిరిస్​కు ఒక్కో ‘కీ’ పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో మాస్టర్ క్వొశ్చన్​ పేపర్ ‘కీ’ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీ డిసైడ్ అయింది. అయితే ప్రిలిమినరీ ‘కీ’లో ఏమైనా అభ్యంతరాలుంటే వారం రోజుల పాటు దరఖాస్తులు తీసుకుంటారు. వాటిపై టీఎస్​పీఎస్సీ నిపుణులతో కమిటీ వేసి క్లారిటీకి వస్తారు. ఈ ప్రక్రియకు మరో వారం రోజుల టైమ్ పట్టే అవకాశం ఉంది. తర్వాత ఫైనల్ ‘కీ’ రిలీజ్ చేసి, రిజల్ట్స్​ వెల్లడిస్తారు. ఈ క్రమంలోనే ప్రతీ కేటగిరిలో ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే గ్రూప్ 1 పేపర్ టఫ్ గా రావడంతో అందరిలోనూ రిజల్ట్స్​పై 
ఉత్కంఠ నెలకొంది.