గ్రూప్1 ప్రిలిమ్స్​ఓఎంఆర్ వాల్యుయేషన్ల ప్రాసెస్​ పూర్తి

గ్రూప్1 ప్రిలిమ్స్​ఓఎంఆర్ వాల్యుయేషన్ల ప్రాసెస్​ పూర్తి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్​ రిజల్ట్స్​పై అందరిలో ఆసక్తి  నెలకొంది. మెయిన్స్ ​ఎంపిక ఎలా జరుగుతుందనే దానిపై అభ్యర్థుల్లో చర్చ నడుస్తోంది. సివిల్స్ మాదిరిగానే  గ్రూప్1 మెయిన్స్​కు మెరిట్ లిస్టు ఇవ్వకుండా, పికప్ (సెలెక్షన్) లిస్టును ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అయితే హారిజాంటల్ రిజర్వేషన్లపై  క్లారిటీ వచ్చిన వెంటనే, పికప్ లిస్టు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి అక్టోబర్16న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా  2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ ‘కీ’ ని వారం కింద టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ప్రశ్నపత్రంలోని 150 క్వశ్చన్లలో ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించగా, మరో మూడు ప్రశ్నల ఆన్సర్స్ ఆప్షన్లను మార్చింది. దీంతో మొత్తం150 మార్కులను145 ప్రశ్నలకే లెక్కగట్టనున్నారు. ఈ విధానంతో ఆన్సర్ కరెక్ట్ ఉన్న ప్రతి ప్రశ్నకు 1.0344  మార్కులను అభ్యర్థులకు ఇస్తారు. అయితే 2.86 లక్షల మంది పరీక్ష రాయడంతో, వ్యక్తిగతంగా ఆ అభ్యర్థికి తప్ప, ఇతరలకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం మెరిట్ లిస్టు ఇవ్వకపోవడంతో, ఏ మల్టీజోన్​లో ఏ కేటగిరీలో ఎంతవరకూ కటాఫ్ ఉంటుందనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. దీంతో మెయిన్స్ కు ఎవరు ఎంపిక అవుతారో క్లారిటీ లేకుండా పోయింది. మరోపక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయిందని కమిషన్ అధికారులు చెప్తున్నారు.

రిజర్వేషన్ల వారీగా లిస్టులు ఫైనల్ 

గ్రూప్1 ప్రిలిమ్స్​కు అటెండ్ అయిన 2.86  లక్షల మంది అభ్యర్థులకు సంబంధించి మెరిట్ లిస్టు ఇవ్వబోమని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. మెయిన్స్​కు ఎంపికయ్యే అభ్యర్థుల పికప్ (సెలెక్షన్) లిస్టు మాత్రమే ఇస్తామని పేర్కొంటున్నారు. రెండు మల్టీజోన్ల వారీగా ఆయా  కేటగిరిల్లో ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మెయిన్స్​కు ఎంపిక చేయనున్నారు. రిజర్వేషన్ల వారీగా లిస్టులు ఫైనల్ చేయనున్నారు. ఈ లిస్టులో ఎంపికయ్యే వారి హాల్ టికెట్ నంబర్లు ప్రకటించే అవకాశముంది. అయితే మార్కుల వివరాలు దాంట్లో పెడ్తరో లేదో అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ హారిజాంటల్ రిజర్వేషన్లపై  హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఇచ్చిన వర్టికల్ విధానంలో కాకుండా హారిజాంటల్ విధానంలోనే గ్రూప్1 రిక్రూట్మెంట్ చేపట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఈ వారంలో వచ్చే అవకాశముందని కమిషన్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క దీనిపై తెలంగాణ సర్కారు కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 
దీంతో టీఎస్పీఎస్సీ అధికారుల్లోనూ అయోమయం నెలకొన్నది. మెయిన్స్ ఎగ్జామ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు హారిజాంటల్, వర్టికల్ విధానంలో రెండు పికప్ లిస్టులు రెడీ చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుకు పోయే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్టు  సమాచారం.