రోస్టర్ ఆధారంగానే మెయిన్స్ కు ఎంపిక

రోస్టర్ ఆధారంగానే మెయిన్స్ కు ఎంపిక
  • రోస్టర్ ఆధారంగానే మెయిన్స్ కు ఎంపిక  
  • 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా 
  • ఇప్పటి వరకు 1.33 లక్షల మంది దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అప్లికేషన్లు భారీగా వస్తుండడంతో అందుకు తగ్గట్టు సెంటర్లు, ఇతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను జులై 31న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రిలిమ్స్ ను జులై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని టీఎస్ పీఎస్సీ గతంలో ప్రకటించింది. అయితే పోలీస్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ ను ఆగస్టులోనే నిర్వహించాలని అధికారులు భావిస్తుండడంతో, ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా జులై 31న నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ రోజు నేషనల్ లెవెల్ పోటీ పరీక్షలు, ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మరో తేదీ పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా సెంటర్లను ఎంపిక చేయనుండడంతో ఈ నెల 31 తర్వాతే అధికారికంగా సెంటర్లు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 

గ్రూప్ 1లో 19 కేటగిరీల్లో 503 పోస్టులను భర్తీ చేసేందుకు ఏప్రిల్​లో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడినంక తొలి గ్రూప్1 నోటిఫికేషన్​కావడంతో కోర్టు కేసులు లేకుండా ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆన్​లైన్​లో అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.33 లక్షల మంది దరఖాస్తు  చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో మరో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దానికి అనుగుణంగానే అభ్యర్థులు సెంటర్ల కోసం ప్రాధాన్య క్రమంలో 12 జిల్లాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. 

ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఆధారంగానే...  
ప్రిలిమ్స్​ మార్కుల ఆధారంగానే మెయిన్స్​కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అయితే గతంలో జనరల్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉండేది. కానీ ప్రస్తుతం రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మొత్తం 503 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మందిని ఎంపిక చేయాలి. అయితే ప్రిలిమ్స్​లో టాప్​లో నిలిచిన 25,150 మందిని కాకుండా... రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదట మొత్తం ఎన్ని ఓపెన్ పోస్టులు ఉంటే, ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో నిలిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వ్ డ్ పోస్టులకు ఆ కేటగిరీలోని ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో ఉన్న ఆ కేటగిరీ అభ్యర్థులనే ఎంపిక చేస్తారు. 

యూనిఫామ్ పోస్టులకు ఎత్తుపై స్పష్టత ఇవ్వలే...  
గ్రూప్ 1లో డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూరింటెండెంట్ పోస్టులకు అర్హతలపై స్పష్టత ఇవ్వలేదు. అభ్యర్థులకు 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని నిబంధన ఉంది. అయితే ప్రిలిమ్స్ అప్లికేషన్లలో మాత్రం హైట్ ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో కొంతమంది ఎత్తు తక్కువగా ఉన్నా ఆయా పోస్టులకు అప్లై చేశారు. సర్కారు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఇలాంటి అభ్యర్థులు మెరిట్​లో ఎంపికైతే, యూనిఫామ్​కొలువులకు అర్హత ఎలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.