
- కష్టపడి జాబ్స్ సంపాదిస్తే రూ.3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడమేంది?
- దాంట్లో ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు
- మా పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు చేయొద్దు
- నోటికాడి కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన తమ పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కో పోస్టును రూ. 3 కోట్లకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో తమ పిల్లలతో పాటు తామూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పులు చేసి, కూలినాలి పనులు చేసుకొని పిల్లలను చదివించినం. చివరికి నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడుతున్నరు. అసలు మూడు కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు. పోస్టులు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్నవారు.. నిరూపించాలి. వాళ్లు నిరూపిస్తే.. మేం చావడానికైనా సిద్ధం” అని తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా.. రాష్ట్రంలో వివిధ పార్టీలు రాజకీయ ఆరోపణలకు దిగాయి. రూ. 3 కోట్లకు జాబ్స్‌ను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలకు దిగాయి. వీటిని ఖండిస్తున్నట్టు గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు తెలిపారు. ఏండ్ల తరబడి కష్టపడి చదివిన తర్వాతే ర్యాంకులు పొందారని అన్నారు. తమకు దూరంగా ఏండ్ల పాటు కోచింగ్‌లు తీసుకొని, హాస్టళ్లలో ఉండి, ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి తమ బిడ్డలు చదివి ర్యాంకులు సాధించారని.. రాజకీయాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు దిగుతూ తమ పిల్లలను దోషులుగా చిత్రిస్తున్నారని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాసి, రెండు సార్లు మెయిన్స్ రాశారని.. మళ్లీ పరీక్షలు రాయాలనడం ఎంత వరకూ కరక్ట్ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ మళ్లీ పరీక్షలు రాసినా.. ఇలాంటి ఆరోపణలు చేయలేరని గ్యారంటీ ఉందా? అని వారు ప్రశ్నించారు.
నిందలు వేయొద్దు
‘‘మా బాబు ఉదయ కిరణ్‌కు 67వ ర్యాంకు వచ్చింది. మేము మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి, కూలి పనులు చేసుకుంటూ మా బాబును ఇంగ్లీష్ మీడియంలో చదివించినం. మూడు దసరా పండుగల నుంచి వాడు ఒక్కరోజు కూడా మాతో గడపలేదు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఈ ర్యాంకు సాధించిండు. అలాంటి మాకు.. ‘మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం కొన్నారు’ అనే నిందలు వినడం చాలా బాధగా ఉంది. ఆ డబ్బు ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చామో ఆరోపణలు చేస్తున్నవాళ్లు చెప్పాలి? గతంలో అవకతవకలు జరిగినప్పుడు కూడా మా బాబు నిరాశపడకుండా కష్టపడి చదివి ర్యాంకు సాధించిండు. ఇప్పుడు అన్నీ అయిపోయి ఉద్యోగంలో చేరే సమయంలో ఆరోపణలు చేయడం అన్యాయం. మా ఊరిలో చాలామంది పిల్లలు మా బాబును ఆదర్శంగా తీసుకున్నరు. ఇప్పుడు ఈ నిందలతో ఇబ్బందులు పడుతున్నం. దయచేసి రాజకీయ స్వార్థం కోసం పిల్లల జీవితాలను నాశనం చేయకండి. నోటికాడి ముద్దను లాక్కోవద్దు. వాళ్ల కష్టాన్ని నీళ్ల పాలు చేయొద్దు. మూడు కోట్లు కాదు, 30 లక్షలైనా మాకు బ్యాంకులో చూపించగలరా..? తప్పు చేసి రోడ్డున పడినట్లు కాకుండా.. కష్టపడి చదివి, ర్యాంకు తెచ్చుకుని రోడ్డున పడినట్లు అనిపిస్తున్నది”
- లలిత, పేరెంట్
రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు
ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు నిలబడితే.. ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నరా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే ఇద్దరికే వస్తుంది. మేం కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు.. కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్లీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు. మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాల్నా? వాళ్ల వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా? మూడు కోట్ల స్కాం అంటున్నవారు దాన్ని నిరూపించాలి.
- ఓ తల్లి విజ్ఞప్తి
కూలీనాలి చేసి చదివించుకున్నం
మాది కోదాడ పక్కన వాయల సింగారం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్లనే చదివించిన. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తయ్? ఇవ్వడానికి 3 కోట్లు ఉంటే మేమే ఏదో బిజినెస్ చేసుకుని బతికేవాళ్లం. కూలీనాలికిపోయి మా పిల్లల్ని చదివించుకున్నం. మాది కూలి బతుకు అయిపోయింది.. కనీసం పిల్లలన్న మంచిగా బతుకుతురేమని మేం ఆశపడ్డం. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్.. మాకు పెద్దలు ఎవ్వరు తెలవదు. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే మా పిల్లలు చదువుకున్నరు. మా పిల్లల్ని అన్యాయం చేయకండి. - సీత, పేరెంట్
సర్కారు స్ట్రాంగ్‌గా నిలబడాలి
‘‘బయట జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై గవర్నమెంట్ స్ట్రాంగ్‌గా నిలబడాలి. గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు. మళ్లీ మళ్లీ ఎగ్జామ్స్ జరిగితే.. అంతం ఎక్కడ? సెలెక్ట్ కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు.. వాళ్లు అన్యాయం జరిగిందంటనే ఉంటారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతే భవిష్యత్తులో ఉద్యోగార్థులు వ్యవస్థను నమ్మలేరు. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం బలమైన చర్యలతో అడ్డుకోవాలి. - ఆనంద్ కుమార్, ర్యాంకర్ తండ్రి
ర్యాంకులు వచ్చిన ప్రతి ఒక్కరూ
రూ.3 కోట్లు ఇస్తే.. 563 మంది ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో ఆరోపణలు చేసినవాళ్లు చూపించాలి. మాకు చాలా బాధగా ఉంది. మాకు న్యాయం చేయాలి కోరుతున్నం. రేయింబవళ్లు కష్టపడి చదివిన మా పిల్లల జీవితాలను ఆగం చేయొద్దు.”
- ఇది మరో గ్రూప్1 ర్యాంకర్ తల్లి గోస
పాల ప్యాకెట్‌కే డబ్బుల్లేవ్.. 3కోట్లు ఎక్కడి నుంచి తెస్తం సార్?
నాకు ఏడుగురు బిడ్డలు.. ఒక బాబు. మేము కూలీనాలి చేసుకొని ఇండ్లలో పనిచేసి మా బిడ్డను చదివించినం. మాకు ఒక పాల ప్యాకెట్ కొనేందుకే డబ్బులు లేవు. అలాంటిది మూడు కోట్లు ఎక్కడి నుంచి తెస్తం సార్? మాకు అంత స్థోమత ఉంటే కూలి పనులు చేసుకోకుండా ఏదైనా వ్యాపారం చేసుకునేవాళ్లం. నాలుగేండ్ల బాబును ఇంట్లో ఉంచి నా కూతురు కోచింగ్‌కు వెళ్లి చదివింది. ర్యాంకు సాధించింది. తను ఉద్యోగంలో చేరితే మా బతుకులు బాగుపడ్తాయి. - ఓ తల్లి ఆవేదన
నిరూపిస్తే తల్లికొడుకులం చావడానికి సిద్ధం
‘‘మా బాబు 368వ ర్యాంకు సాధించిండు. ఎన్నో పండుగలు, సంతోషాలు పక్కన పెట్టి చదివిండు. నాలాంటి పేదవాళ్లకు మూడు కోట్లు, ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తయ్ సార్? నేను నెలకు రూ. 11,700 జీతంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటున్న. నా కొడుకు గ్రూప్ -4 కూడా సాధించిండు. ఒక్క రూపాయి లంచం ఇచ్చి ఉంటే మాకు ఈ ఉద్యోగమే అవసరం లేదు. పైసలిచ్చినట్టు ఫ్రూఫ్ చేస్తే మేం తల్లికొడుకులం చనిపోవడానికి సిద్ధం. నా కొడుకు తండ్రిని కోల్పోయాడు.. ఇప్పుడు నేను కూడా దూరం అవుతున్నానన్నంత బాధగా ఉంది. అశోక్‌నగర్‌లో రూమ్‌లో ఉండి చదివాడు. నిందల వల్ల మేం తిరగలేకపోతున్నం’’.
- ఓ తల్లి కంటతడి
ఆ లీడర్ మాటలు బాధపెడ్తున్నయ్?
ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏందంటే.. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇల్లిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది.. రూ. 3కోట్లకు ఉద్యోగాలు కొనుకున్నారని ఆయన అనడం దారుణం. కష్టపడి చదివి ర్యాంకు సాధించిన పిల్లలు.. ఇప్పుడు ఈ నిందలతో ఆగమైతున్నరు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు. దయచేసి పిల్లల బాధను, తల్లిదండ్రుల ఆవేదనన అర్థం చేసుకోండి.
- ఓ తల్లి విన్నపం