తెలంగాణ జాబ్స్ స్పెషల్ : పిల్లల జనాభా తక్కువున్న రాష్ట్రం

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : పిల్లల జనాభా తక్కువున్న రాష్ట్రం

రాష్ట్రంలో గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నెలలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. అయితే, గతంతో పోలిస్తే సిలబస్​లో టీఎస్​పీఎస్సీ మార్పులు చేసింది. పేపర్​–3 ఎకానమీ అండ్​ డెవలప్​మెంట్​లో పాత సిలబస్​ను కొనసాగిస్తూనే కొత్త అంశాలను చేర్చింది.  ముఖ్యంగా జనాభా శాస్త్రాన్ని చేర్చారు. గత నోటిఫికేషన్లతో పోలిస్తే జనాభా నుంచి 2 లేదా 3 మార్కులు వచ్చేవి. సిలబస్​లో ప్రత్యేకంగా పేర్కొన్న నేపథ్యంలో ఈసారి 25 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనాభా శాస్త్రం సిలబస్​, కవర్​ చేయాల్సిన అంశాలను తెలుసుకుందాం. 

ఎకానమీ అండ్​ డెవలప్​మెంట్​ పేపర్​లో ఇండియన్​ ఎకానమీ: సమస్యలు సవాళ్లలో మొదటి చాప్టర్​ డెమోగ్రఫీ గురించి ఇచ్చారు. భారత జనాభా, జనాభా లక్షణాలు, పరిమాణం, జనాభా వృద్ధిరేటు, జనాభా  డెవిడెండ్​, జనాభా పంపిణీ,  భారత జనాభా విధానాలు అని పేర్కొన్నారు.  జనన, మరణ రేట్లకూ ఆర్థికాభివృద్ధికీ మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది జనాభా పరిణామ సిద్ధాంతం. దేశంలో మొదటిసారిగా 1872లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. పూర్తిస్థాయి లెక్కలు మాత్రం 1891లో జరిగాయి. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. స్వాతంత్ర్య భారత దేశ మొదటి జనాభా లెక్కలు 1951లో నిర్వహించారు. అందువల్ల 1872 నుంచి చూస్తే 2011 జనాభా లెక్కలు 15వది కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఏడోది. 1891లో భారత జనాభా 23.6 కోట్లు. 2011 నాటికి భారత జనాభా 121.09కోట్లు. ఈ మధ్య కాలంలో జనాభా పెరుగుదలలో వచ్చిన మార్పులు, వార్షిక వృద్ధిరేట్లను చదవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక, అత్యల్ప జనాభా  గల దేశాలు, భారత స్థానం, జనసాంద్రత తదితర అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. సైజ్​ ఆఫ్​ పాపులేషన్​లో భాగంగా దేశంలో చివరిసారిగా జరిగిన జనాభా లెక్కల సేకరణలోని డైనమిక్​ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.  ముఖ్యంగా చిన్న పిల్లల జనాభా(0–6)పై ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి. దేశంలో అధిక, అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, శాతాలను ఒకటికి రెండు సార్లు చదవడం ద్వారా సులువుగా జవాబులను గుర్తించవచ్చు. 

జనాభా వృద్ధి 

ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల్లో పెరిగే జనాభాను జనాభా వృద్ధి అంటారు. ఈ అంశాన్ని 2001, 2011 జనాభా లెక్కలను పోల్చుతూ చదవాలి. అంతేకాకుండా 1911 నుంచి 2011 జనాభా లెక్కల వరకు దశాబ్ద వృద్ధిరేటు, వార్షిక వృద్ధిరేట్లు, మధ్య తేడాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అధిక వృద్ధిరేటు, అల్ప వృద్ధిరేటు గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తెలుసుకోవాలి. అలాగే జనసాంద్రత, స్త్రీ, పురుష నిష్పత్తి, పిల్లల జనాభాలో లింగ నిష్పత్తి, జనాభాలో వయస్సుల వారీ విభజన, జనన, మరణ, శిశు మరణ రేటు, ఆయుర్ధాయం, పట్టణీకరణ  తదితర అంశాలను లోతుగా చదవాలి. అక్షరాస్యతపై ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. దేశంలో అక్షరాస్యుల సంఖ్య, పురుష, స్త్రీ అక్షరాస్యుల సంఖ్య, మొత్తం అక్షరాస్యుల్లో పట్టణ, గ్రామీణ, పట్టణ పురుష, పట్టణ మహిళ అక్షరాస్యులు మధ్య గల వ్యత్యాసాలు ప్రశ్నలు వస్తుంటాయి. 2011 జనాభాలో మతాలవారీగా, ఎస్సీ, ఎస్టీ జనాభా పెరుగుదల, తరుగుదలను తెలుసుకోవాలి. 

డెమోగ్రాఫిక్​ డెవిడెండ్​

జనాభాలో పనిచేసే జనాభా వర్గం పెరుగుట వల్ల ఆర్థిక వృద్ధిరేటు పెరిగితే దానిని డమోగ్రఫిక్​ డెవిడెండ్​ అంటారు. దీన్నే డెమోగ్రాఫిక్​ బోనస్​ అని డెమోగ్రఫిక్​ విండో అని పిలుస్తారు. ఈ పరిణామం జనన రేటు తగ్గుట వల్ల, వయసు వారీ నిర్మాణంలో మార్పు వచ్చి పనిచేసే జనాభా పెరగడానికి దోహదపడుతుంది. ఒక దేశ జనాభాను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.  15 సంవత్సరాల లోపు వయస్సు గల జనాభా. వీరిని పిల్లల జనాభా లేదా అనుత్పాదక జనాభా అంటారు.  15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల జనాభా. వీరిని పనిచేసే వయస్సు గల జనాభా లేదా ఉత్పాదక జనాభా అంటారు. 65 సంవత్సరాలు మధ్య వయస్సు గల జనాభా వీరిని వృద్ధ లేదా అనుత్పాదక జనాభా అంటారు. పిల్లలు, వృద్ధులు వారి జీవనం కోసం ఉత్పాదక జనాభాపై ఆధారపడతారు. మొత్తం జనాభాలో పనిచేయగల సామర్థ్యమున్న జనాభా లేదా ఉత్పాదక జనాభా శాతం పెరుగుదల వల్ల దేశ ఆర్థిక వృద్ధిరేటు పెరిగితే దానిని డెమోగ్రాఫిక్​ డెవిడెండ్​ అంటారు. ఈ డెమోగ్రపిక్​ డెవిడెండ్​ వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అభ్యర్థులు గమనించాలి.

ఈ తేడాలు గమనించండి 

పేపర్​–3 సెక్షన్​లో ఎకానమీ అండ్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ తెలంగాణలో రెండో చాప్టర్​ డమోగ్రఫీ అండ్​ హెచ్​ఆర్డీ అని పేర్కొన్నారు. ఈ విభాగంలో జనాభా ముఖ్య లక్షణాలు, పరిమాణం, వృద్ధిరేటు, వయస్సుల వారీ జనాభా రాష్ట్ర కోణంలో చదవాల్సి ఉంటుంది. అయితే, ఇవే అంశాలు దేశానికి సంబంధించినవి కూడా సిలబస్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ, రాష్ట్ర జనాభా లెక్కలను సరిపోల్చుతూ చదవాలి. దేశ సగటుతో పోల్చితే తెలంగాణ జనాభా డైనమిక్స్​ ఎలా ఉన్నాయో గమనించాలి. ముఖ్యంగా అక్షరాస్యత, లింగ నిష్పత్తి, పిల్లల్లో లింగ నిష్పత్తి, శిశు మరణాల రేటు, మాతృమరణాల రేటు, ప్రసూతి రేటు తదితర అంశాలను నెగెటివ్​ కోణంలో చదవాలి. ఇండియా డెమోగ్రఫీ సిలబస్​లో మానవ అభివృద్ధి సూచీ గురించి ప్రస్తావించ లేదు. కానీ తెలంగాణ సిలబస్​లో ఇచ్చారు. కాబట్టి నీతి ఆయోగ్​ ప్రచురించే రాష్ట్రాల వారీగా మానవ సూచికలను క్షుణ్ణంగా చదవాలి. జిల్లాల వారీగా డైనమిక్స్​పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.