- ముగ్గురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్ లు, మరో ఇద్దరు ఐఎఫ్ఎస్లు
- సమస్యల పరిష్కారంలో ఎవరికి వారే ప్రత్యేకం
- పాలనలో కనిపిస్తున్న మార్క్
- సమర్థంగా పథకాల అమలు
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడడంలో సివిల్ సర్వీస్ ఉద్యోగుల పాత్ర కీలకం. కాగా అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ మార్క్ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టి, చొరవతో జిల్లాలో ఏకంగా ఏడుగురు సివిల్ సర్వెంట్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేస్తూ తమ మార్క్ చాటుకుంటున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాలనలో కొత్తదనం కనిపిస్తోంది.
ప్రతి రోజు గ్రీవెన్స్‌కు కలెక్టర్ శ్రీకారం
జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు మొత్తం ఏడుగురు పనిచేస్తుండడంతో ప్రగతి అంశంలో పురోగతి కనిపిస్తోంది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండేండ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కలెక్టర్ విధి నిర్వహణలో కచ్చితత్వంతో ఉంటారని, ఆయన నోటీస్ కు వెళితే పనిజరుగుతుందని ప్రజల్లో నమ్మకం నెలకొంది. గతంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క, ఇప్పుడున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నారు.
వారానికోసారి ఉండే గ్రీవెన్స్‌ను కలెక్టరేట్లో ప్రతి రోజు ఉండేలా చేపట్టిన కార్యక్రమం ఆయన నిబద్ధతను తెలియజేస్తోంది.
అడిషనల్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ ఎవరికి వారే ప్రత్యేకం..
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సైతం పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాన మంత్రి జన్ మన్ కింద దశాబ్దం నుంచి ఆధార్ కార్డు లేకుండా ఉన్న ప్రజలకు వాటిని ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కిందిస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మన్లో భాగంగా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణాన్ని అన్ని జిల్లాల కంటే ముందుగా పూర్తిచేయించారు. ఈ పథకం అమలుపై ఇటీవల కలెక్టర్ అవార్డ్ సైతం అందుకున్నారు. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ అఫీస్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి పోస్టింగ్‌కు వచ్చిన ఐఏస్ఐ అధికారి శ్రద్ధాశుక్లా సైతం పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మొదటి నుంచి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సబ్ డివిజన్ పరిధిలో అనేక భూ సమస్యలు పరిష్కరించారు. ఆరోపణలు ఉన్న అధికారులను మార్చేశారు. తన దగ్గరకు వచ్చిన పేదల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని తీరుస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ఎస్పీ, ఏఎస్పీ
ఐపీఎస్ అధికారులు ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ పోలీస్ శాఖ తరఫున కొత్తగా పనిచేస్తున్నా.. డ్రగ్స్ కంట్రోల్, గంజాయి నిర్మూలనలో ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.
మొక్కుబడిగా కాకుండా గంజాయి, డ్రగ్స్‌ను కట్టడి చేస్తూ ప్రజలు, యువతలో అవేర్నెస్ పెంచేందుకు కృషి చేస్తున్నారు. గంజాయి సాగు చేస్తున్నట్లు అనుమానం ఉన్న పంట చేన్లను ఏఎస్పీ స్వయంగా పరిశీలిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ మీకోసంలో భాగంగా ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
అడవుల రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు విశేష కృషి
అడవుల జిల్లా ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను నడిపిస్తున్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) నీరజ్ కుమార్ టిబ్రెవాల్, కాగజ్ నగర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ సుఖ్దేవ్ బోబడే అడవుల రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. కాగజ్ నగర్ అడవులు పులుల ఆవాసానికి సేఫ్ జోన్‌గా మారేలా నిరంతరం కృషి చేస్తున్నారు.
ఏండ్లుగా ఉన్న పోడు సమస్యను పరిష్కరిస్తున్నారు. పోడు సాగు అంశంలో పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్మగ్లింగ్, అడవుల నరికివేత విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటూ సిబ్బందిని నిత్యం నిశానిర్దేశం చేస్తున్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి పాటుపడుతున్నారు.
