
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 పరీక్షల రివైజ్డ్ తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నవంబర్ 2, 3 తేదీల్లో ఎగ్జామ్స్ జరపాలని డిసైడ్ చేశారు. రెండు రోజుల పాటు నాలుగు పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పరీక్షలకు వారం రోజుల ముందు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు పెడ్తామని తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటికి5.51 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. గురుకుల షెడ్యూల్ రావడంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. టీఎస్‌పీఎస్సీ పట్టించుకోకపోవడంతో కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో సర్కారు గ్రూప్ 2 పరీక్షల వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.