బీజేపీలో గ్రూపుల లొల్లి.. అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారుగా పైరవీలు

బీజేపీలో గ్రూపుల లొల్లి.. అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారుగా పైరవీలు
  • కీలక సమయంలో రాజాసింగ్ హాట్ కామెంట్స్
  • నిన్నటి సెల్యూట్ తెలంగాణకు ఎమ్మెల్యే డుమ్మా
  • దేశం, ధర్మం, సమాజంపై అవగాహన ఉన్నోళ్లకే స్టేట్ చీఫ్​ పోస్ట్ ఇవ్వాలని వ్యాఖ్య
  • ఎంపీలు, ఎమ్మెల్యేలను సంప్రదించాకే డెసిషన్ తీసుకోవాలని మెలిక
  • దూకుడు స్వభావం ఉంటేనే పార్టీకి భవిష్యత్తని కామెంట్


హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో గ్రూపుల లొల్లి కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికోసం పలువురు లీడర్లు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి ఆశీస్సులు పొందుతున్నారు. మరికొందరు ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు సంచలనం రేకెత్తించాయి. ఆయన నిన్న విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వొద్దో ఈ వీడియోలో చెప్పేశారు. 

కిషన్ రెడ్డితో గ్యాప్ కంటిన్యూ..

కొంత కాలంగా బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు గ్యాప్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెగ్యులర్ గా నాంపల్లి ఆఫీసుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన రాజాసింగ్ ఇప్పుడు ఆఫీసు రావడం లేదు.   గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ కు పార్టీ ఫ్లోర్ లీడర్ పదవిని ఇస్తారనే చర్చకూడా సాగింది. అయితే రకరకాల కారణాలతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ పోస్టు అప్పగించారు. దీంతో ఆయన అలకబూనారని తెలుస్తోంది.  తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ ఎంపీగా అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలతను ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఇటీవల హైదరాబాద్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల సన్మానం కోసం నిర్వహించిన ‘సెల్యూట్ తెలంగాణ’ సభకు కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. మరుసటి రోజు (నిన్న) ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఎలా ఉండాలో చెప్పారు. ఈ వీడియో సందేశం చూసిన వారికి ఎవరిని నియమించవద్దో డైరెక్టుగానే చెప్పినట్టు అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు? ఎవరు పరోక్షంగా రాజాసింగ్ తో చెప్పించారనేది చర్చనీయాంశంగా మారింది. 

అధ్యక్ష రేసులో ఐదుగురు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ఐదుగురు నేతలున్నారు. ఎవరిక వారుగా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాజాసింగ్ కామెంట్ చేసినట్టు చూసుకుంటే వీరిలో ఈటల రాజేందర్ వామపక్ష భావాలున్న నాయకుడు. బీఆర్ఎస్ లో కొనసాగి బీజేపీలోకి మారారు. డీకే అరుణ గతంలో కాంగ్రెస్ లో మంత్రిగానే విధులు నిర్వర్తించారు. రఘునందన్ రావు కూడా గతంలో బీఆర్ఎస్ లో చాలా కాలంపాటు పనిచేశారు. కేసీఆర్ కు సన్నిహితుడిగా కూడా కొనసాగారు. ఇక మిగిలింది. రాంచందర్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్. వీళ్లిద్దరిలో రాంచందర్ రావు పూర్తి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన లీడర్. మొదటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. మరో నాయకుడు ధర్మపురి అర్వింద్ ఆయన రాజకీయ జీవితం బీజేపీలోనే ప్రారంభమైంది. రాజాసింగ్ చెప్పిన రెండో స్వభావం దూకుడు అరవింద్ కు ఉంది. రాజాసింగ్ పరోక్షంగా అర్వింద్ కు మద్దతు ఇచ్చారా..? లేదా రాంచందర్ రావును సపోర్ట్ చేస్తున్నారా..? అన్న చర్చనడుస్తోంది. 

రాజాసింగ్ ఏమన్నారంటే? 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్నవారిని నియమించాలని రాజాసింగ్ కోరారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల ఒపీనియన్స్ తీసుకోవాలంటూ ఓ వీడియో విడుదల చేశారు.  రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూనే దూకుడుగా వ్యవహరించే వ్యక్తికే పగ్గాలు అప్పగించాలనే మరో సూచన చేశారు.