సిరిసిల్ల టీఆర్ఎస్​లో అసమ్మతి

సిరిసిల్ల టీఆర్ఎస్​లో అసమ్మతి
  • సిరిసిల్ల టీఆర్ఎస్​లో అసమ్మతి
  • చైర్​పర్సన్​పై  కౌన్సిలర్ల అసంతృప్తి 
  • కేటీఆర్​ను కలిసేందుకు  వెళ్లిన 20 మంది 

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు:  సిరిసిల్ల టీఆర్​ఎస్​లో మరోసారి గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆమె భర్తపై కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ కు పయనం అయ్యారు. మున్సిపల్ కౌన్సిల్​లో చైర్ పర్సన్ భర్త, టీఆర్ఎస్ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని కౌన్సిలర్లు ఆగ్రహంతో ఉన్నారు. కొంతకాలంగా చైర్​పర్సన్​భర్తకు, కౌన్సిలర్లకు  మధ్య దూరం పెరిగింది. వంద కోట్ల కాంట్రాక్ట్ పనుల విషయంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కాంట్రాక్ట్ పనులు జిందం తనకు నచ్చినట్లు అప్పజెబుతున్నాడని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా మంగళవారం కౌన్సిలర్లు సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న  టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు కౌన్సిలర్లు, చైర్​పర్సన్​భర్త మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. జిందం చక్రపాణితో మాట్లాడారు. చర్చించిన విషయాలను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ కు నేరుగా తమ గోడు వెల్లబోసుకుంటామంటూ 20 మంది కౌన్సిలర్లు బస్సులో హైదరాబాద్​కు బయలుదేరారు. 

మొన్న సెస్.. నిన్న అర్బన్.. నేడు మున్సిపల్..

సిరిసిల్లలో రాజకీయ అనిశ్చితి పెరగడంతోపాటు కార్యకర్తల్లో భరోసా తగ్గుతోంది. టీఆర్ఎస్ సొంత గూటి నేతలే పాలక వర్గాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందట ఎన్నికలు లేకుండా కేటీఆర్ సెస్ కొత్త పాలక వర్గాన్ని నియమించారు. నామినేట్ చేసిన పాలకవర్గంపై సొంత నేతల సహకారంతో కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చారు. ఇటీవల అర్బన్ బ్యాంక్ పాలక వర్గంపై టీఆర్ఎస్ డైరెక్టర్లు అవిశ్వాసం నోటీస్​ఇచ్చారు. కేటీఆర్ మేనబావ రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. తాజాగా మున్సిపల్ చైర్ పర్సన్ పై కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు 20 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ వెళ్లడం సిరిసిల్లలో హాట్ టాపిక్​గా మారింది.