టీయూలో ఇంజినీరింగ్ కాలేజీ కోసం .. సర్కారు మీద ప్రెజర్

టీయూలో ఇంజినీరింగ్ కాలేజీ కోసం .. సర్కారు మీద ప్రెజర్
  • పర్మిషన్​ ఇస్తే చాలు.. క్లాసులు స్టార్ట్​ చేస్తామంటున్న వీసీ
  • బిల్డింగ్​ రెడీగా ఉందంటూ రిపోర్ట్​
  • విద్యాకమిషన్​, ఉన్నత విద్యామండలి చైర్మన్లకు విన్నపాలు

నిజామాబాద్​, వెలుగు: తెలంగాణ వర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్​ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్​ కాలేజీ నిర్వహించేందుకు అన్ని వసతులు, అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో చొరవ చూపాలని శనివారం వర్సిటీని విజిట్​చేసిన విద్యా కమిషన్ చైర్మన్​ ఆకునూరి మురళిని ప్రొఫెసర్లు, స్టూడెంట్స్​కోరారు. గత నెల17న ఇక్కడకు వచ్చిన హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్​ బాలకృష్ణారెడ్డిని కూడా ఇంజనీరింగ్​ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరగా.. సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. 

నిజామాబాద్​రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కూడా ముఖ్యమంత్రిని లేఖ రాశారు. పర్మిషన్​ ఇచ్చిన వెంటనే కాలేజీ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్టు వీసీ యాదగిరిరావు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించారు. ఇజనీరింగ్​ కౌన్సిలింగ్​ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని స్టూడెంట్స్​ కోరుతున్నారు. 

ఆరు కోర్సుల నుంచి 32 వరకు.. 

 ఉస్మానియా, కాకతీయ తరువాత మూడో పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన టీయూ.. యూజీసీ న్యాక్​ 'బీ' గ్రేడ్​ హోదా పొందింది. ఈ నెల 16న వర్సిటీ కాన్వొకేషన్​కు హాజరైన గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ టీయూ గొప్పస్థానాన్ని గురించి మాట్లాడారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన టీయూలో ప్రస్తుతం 32 కోర్సులు ఉన్నాయి. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ వంటి 12 సెల్ఫ్​ ఫైనాన్స్​ కోర్సులు కూడా నడుస్తున్నాయి. వర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్​, అదిలాబాద్​జిల్లాల్లో 320 డిగ్రీ, 81 పీజీ కాలేజీలు ఉండగా 51 వేల స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. క్యాంపస్​ విద్యార్థుల సంఖ్య 2 వేల కన్నా ఎక్కువే. ఈ రెండు జిల్లాల నుంచి ఏటా 55 వేల మంది స్టూడెంట్స్​ ఇంటర్​ పూర్తి చేస్తున్నారు. 

వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్​లోనే చేరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్​ కాలేజీలు ఉండగా ఒక్క టీయూలోనే లేదు. గవర్నమెంట్​ పర్మిషన్​ఇస్తే కాలేజీ ఏర్పాటు చేయడానికిజేఎన్టీయూ అధికారులు రెండేండ్ల కిందటే సంసిద్ధత తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి సొంత సెగ్మెంట్​లోని కోస్గి పాలిటెక్నిక్​కాలేజీని ఇంజినీరింగ్​ కాలేజీగా అప్ గ్రేడ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, మహబూబ్​నగర్​, ఖమ్మంలో కొత్త ఇంజినీరింగ్​ కాలేజీలకు అనుమతులిచ్చారు. దీంతో టీయూలోనూ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ వినిపిస్తోంది.  

ప్రభుత్వం అనుమతిస్తే వర్సిటీలో రూ.18 కోట్లతో నిర్మించిన సైన్స్​ బిల్డింగ్​లో కాలేజీని ప్రారంభిస్తామని వీసీ యాదగిరిరావు చెప్తున్నారు. గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ లేట్​ అయినా నిర్వహణకు ఇబ్బందిలేదంటున్నారు. ఈ నెల 23న హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​చైర్మన్​ బాలకృష్ణారెడ్డి వర్సిటీకి రానున్నారు. ఆయనకు డిటైల్డ్​ రిపోర్ట్​ ఇవ్వడానికి వర్సిటీ అధికారులు రెడీ అవుతున్నారు. వర్సిటీలో ఫార్మసీ, బీపీఈడీ, ఎంఈడీ కాలేజీలు ఏర్పాటు చేయాలని కూడా స్టూడెంట్స్​ కోరుతున్నారు.