
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సీట్లకు ఎక్కడా లేని డిమాండ్ కొనసాగుతోంది. అన్ని గురుకులాల పరిధిలో ఐదో తరగతి అడ్మిషన్ల ప్రక్రియ ముగించినా, సీట్ల కోసం వస్తున్న వందలాది పేరెంట్స్‌తో సొసైటీ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. కొందరైతే మంత్రులు, ఇతర ముఖ్యులతో సిఫార్సు లేఖలను వెంట తీసుకెళ్తూ తమ పిల్లలకు సీట్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో హోమ్‌సిక్ తో ఇంటికివెళ్లి ఎంతకూ తిరిగిరాని విద్యార్థుల సీట్లను వేకెంట్ కోటాకు మళ్లించి, కొందరికి అడ్జస్ట్ చేస్తున్న అధికారులు, రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక కార్యాలయాల్లో ‘నో సీట్స్’ బోర్డులను తగిలించేందుకు రెడీ అవుతున్నారు.
808 గురుకులాలు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలో మొత్తంగా 808 గురుకులాలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి ప్రవేశాల కోసం 63,860 సీట్లకు ఫిబ్రవరిలో వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలకు కలిపి ఎస్సీ గురుకులాల ఆధ్వర్యంలో టీజీ గురుకుల్ సెట్, మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 49,220 సీట్లు ఉండగా 1,26,705 మంది దరఖాస్తు చేసుకున్నారు. మైనార్టీ గురుకులాల్లో 14,640 సీట్లకు గాను 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నా 27,071 మంది మాత్రమే ప్రవేశ పరీక్ష రాశారు. వారిలో 11,359 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో క్వాలిఫయింగ్ మార్కుల కన్నా తక్కువ వచ్చిన వారిలోనూ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రాతిపదికన మిగిలిన సీట్లను భర్తీ చేశారు. అన్ని గురుకులాల్లో ఇప్పటికే మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేశారు. ఈక్రమంలో సొసైటీలన్నీ ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ప్రక్రియను క్లోజ్ చేసినట్లు వెబ్‌సైట్‌లో పెట్టేశాయి. అయినప్పటికీ నిత్యం వందలాది మంది విజిటింగ్ అవర్స్‌లో ఆయా సొసైటీల కార్యదర్శులను కలిసి సీట్లు ఇవ్వమని కాళ్లావేళ్లా పడుతున్నారు. తమ కుటుంబం స్థితిని చెప్పుకొని అవకాశం ఇవ్వాలని అర్థిస్తున్నారు. గతేడాది ఇలాంటి పరిస్థితే నెలకొనగా అన్ని సొసైటీ కార్యాలయాల్లో ‘గురుకులాల్లో సీట్లు నిండిపోయాయి’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా త్వరలో ఇలాంటి బోర్డులు ఏర్పాటుచేయాలని సొసైటీ అధికారులు యోచిస్తున్నారు.
వేకెంట్ సీట్ల కేటాయింపు..
గురుకులాల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల్లో కొందరు హోమ్ సిక్‌తో వెనక్కి వెళ్లిపోతున్నారు. వారి తల్లిదండ్రులతో సంబంధిత స్కూళ్ల ప్రిన్సిపాళ్లు మాట్లాడి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిసార్లు కోరినా తిరిగిరాని విద్యార్థులకు అలాట్ చేసిన సీట్లను వేకెంట్ కోటాలో పెడుతున్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్ష రాసి సీటు దక్కించుకోలేకపోయిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఆయా సీట్లను కేటాయిస్తున్నామని సొసైటీల అధికారులు చెప్తున్నారు.
మంత్రుల నుంచి సిఫార్సు లేఖలు..
గురుకులాల్లో సీట్ల కోసం ప్రతి రోజూ పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు వస్తున్నాయని సొసైటీల అధికారులు చెప్తున్నారు. కొందరు మంత్రులు స్వయంగా ఫోన్ చేస్తూ సీట్లు ఇవ్వాలంటూ సెక్రటరీలను కోరుతున్నారు. ప్రభుత్వంలో ముఖ్యులు సైతం గురుకులాల్లో అడ్మిషన్ల కోసం సొసైటీ కార్యదర్శులకు సిఫార్సు చేస్తున్నారు. కొందరు సీనియర్ అధికారులు కూడా తమ దగ్గరి వారికి సీట్లు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు పంపుతున్నారు. ఈ క్రమంలో రికమండేషన్ ఉన్న వారితో పాటు అర్హులైన పేద విద్యార్థులకు వేకెంట్ సీట్లలో అవకాశం కల్పిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల అధికారులు చెప్తున్నారు.