హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న లీజ్ ఫార్మింగ్

హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న లీజ్ ఫార్మింగ్
  • నయా ట్రెండ్.. లీజ్ ఫార్మింగ్
  • హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న అద్దె వ్యవసాయం
  • రియల్ వెంచర్లలోనూ పంటలు
  • జాబ్‌‌ చేస్తూ కొందరు.. వదిలేసి మరికొందరు
  • వందల ఎకరాల్లో లీజ్‌‌ ఫార్మింగ్‌‌
  • కరోనా తర్వాత పెరిగిన సాగు
  • కూరగాయలు, ఆర్గానిక్‌‌ పంటలకు ప్రిఫరెన్స్‌‌
  • నేరుగా జనానికి సప్లై.. లేదంటే స్టోర్లకు

సిటీలో చిన్న జాబ్‌‌ చేసే వెంకట రమణ ఉద్యోగం పోయింది. దీంతో హైదరాబాద్ శివార్లలో మూడెకరాల ల్యాండ్‌‌ లీజ్‌‌కు తీసుకొని కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. ఆర్గానిక్‌‌ పంట అని ఫ్రెండ్స్‌‌, తెలిసిన వాళ్లలో బాగా ప్రచారం చేశాడు. వాళ్లందరికీ డైరెక్ట్‌‌గా కూరగాయల సప్లై మొదలుపెట్టాడు. ‘ఫీల్డ్‌‌ టు హోం’ అనే కాన్సెప్ట్‌‌తో ప్రారంభించిన కొత్త పనితో ఇపుడు బిజీగా ఉన్నాడు.

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. లీజ్ ఫార్మింగ్ జోరుగా సాగుతోంది. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్లు, ఉద్యోగులు, జాబ్ పోయినోళ్లు, జాబ్ వదిలేసినోళ్లు.. శివార్లలోని భూములు లీజుకు తీసుకొని సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. చాన్నాళ్లుగా పడావుగా ఉన్న భూముల నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తుందని ఓనర్లు కూడా ల్యాండ్‌‌ లీజుకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఏరియాను బట్టి ఏడాదికి 10 వేల నుంచి 50 వేల వరకు లీజు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. లాభసాటిగా ఉన్న ఈ లీజ్‌‌ ఫార్మింగ్‌‌ ఇప్పుడు సిటీలో ట్రెండింగ్‌‌. హైదరాబాద్ శివార్లయిన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో భూములను లీజుకు తీసుకోవడం ఐదారేళ్ల కిందటే స్టార్టయ్యింది. కొందరు కూరగాయలు పండిస్తే మరికొందరు పూల తోటలు వేశారు. వరి రకాలు వేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలు మాత్రమే లీజులకు తీసుకునే వాళ్లు. కానీ ఈ మధ్య పది, పదిహేను ఎకరాలు లీజుకు తీసుకోవడం మొదలైంది. కరోనా తర్వాత ఫార్మింగ్‌‌కు వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్లు 2, 3 ఎకరాలతో స్టార్ట్‌‌ చేస్తున్నారు. చిన్న ఉద్యోగాలు చేసే వాళ్లు కూడా అంతే. రిస్క్‌‌ ఎందుకని తక్కువ భూమి తీసుకొని పంటలు పండిస్తున్నారు.

రియల్‌‌ వెంచర్లు సాగు భూములుగా..

వ్యవసాయ భూములను రియల్‌‌ ఎస్టేట్‌‌ వెంచర్లుగా చేసి అమ్ముకోవడం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి. ఊర్లలో కూడా వ్యవసాయ భూములు రియల్‌‌ వెంచర్లుగా మారిపోయాయి. ఇది హైదరాబాద్‌‌ చుట్టుపక్కల కొన్ని దశాబ్దాల క్రితమే స్టార్టయ్యింది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌‌ రివర్స్‌‌ అవుతోంది. రియల్‌‌ వెంచర్లు మళ్లీ వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. లీజ్‌‌ ఫార్మింగ్‌‌ పెరుగుతోంది. సాధారణంగా వందల ఎకరాలు లీజ్​కు తీసుకొని వ్యవసాయం చేయడం విదేశాల్లో కనిపిస్తుంది. మన దేశంలో కొన్ని మల్టీ నేషనల్‌‌ కంపెనీలు ఉత్తరాఖండ్‌‌, రాజస్థాన్‌‌, బీహార్‌‌, పంజాబ్‌‌, హర్యానా రాష్ట్రాల్లో వందల ఎకరాలు ఇలా సాగు చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం ఒకటీ రెండు నుంచి 10, 15 ఎకరాల దాకా లీజుకు తీసుకొని వ్యవసాయం చేయడం పెరుగుతోంది.

రూ.10 వేల నుంచి 50 వేల దాకా

ప్రస్తుతం సిటీ శివార్లలో దూరం, ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి 50 వేల వరకు లీజ్‌‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. వాటర్‌‌ ఫెసిలిటీ, డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌, బోర్‌‌వెల్‌‌.. ఇలా సౌకర్యాలను బట్టి రెంట్‌‌ పెరుగుతుంది. ఫామ్ హౌజ్‌‌, షెడ్‌‌, పనిముట్లు కూడా ఉంటే రెంట్‌‌ ఎక్కువగా ఉంటుంది. మేడ్చల్‌‌లో రైతు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి తన వాటాగా ఏడెకరాల భూమి వచ్చింది. ఆయన ఉద్యోగి కావడంతో భూమి పడావు పడింది. అన్ని సౌలతులున్నా నాగలి పట్టేవారు లేరు. ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చి ఎకరాకు 25 వేల చొప్పున లీజుకు తీసుకొని కూరగాయల సాగు చేస్తున్నాడు. లాభసాటిగా ఉండడంతో దాన్ని ఆనుకొని ఉన్న మరో 15 ఎకరాలు తీసుకొని మొత్తం 22 ఎకరాల్లో లీజ్‌‌ ఫార్మింగ్‌‌ చేస్తున్నాడు. ఈ తరహాలో కేవలం కూరగాయలే కాకుండా కందులు, మొక్కజొన్న, జొన్నలు, రాగులు, వరిని కూడా సాగుచేస్తున్న వాళ్లు ఉన్నారు. అద్దె సాగు సక్సెస్‌‌ అవుతుండటంతో దీంట్లో పెట్టుబడి పెడుతున్న వాళ్లు కూడా ఉన్నారు.

హార్టికల్చర్ అధికారుల సాయం

హార్టికల్చర్ అధికారులు కూడా కూరగాయలు పండించేందుకు సహకారం అందిస్తుండటంతో లీజు వ్యవసాయానికి మరింత ఆదరణ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, మొయినాబాద్, షాద్ నగర్, నందిగామ, కడ్తల్, శంకర్ పల్లి, తలకొండపల్లి, చిలుకూరు, యాచారం మండలాలు, వికారాబాద్ జిల్లాలోని మార్పెల్లి, మొమీన్ పేట్, నవాబ్ పేట్, పరిగి, కొటెపల్లి మండలాలు, మేడ్చల్ జిల్లాలోని కీసర, దుండిగల్, మూడు చింతలపల్లి, ఘట్ కేసర్ మండలాల్లోని గ్రామాల్లో అద్దె సాగుకు డిమాండ్‌‌ కనిపిస్తోంది. ఒక్క మేడ్చల్ జిల్లా పరిధిలోనే 90 వేల ఎకరాల బీడు భూములు ఉన్నట్లుగా తేలింది. ఇందులో మూడున్నర లక్షల టన్నుల ఆహార పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. లీజ్ ఫార్మింగ్ విధానాన్ని ప్రోత్సాహించేలా విధివిధానాలు రూపొందించే పనిలో జిల్లా హార్టికల్చర్ అధికారులు ఉన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ భారీగానే పడావు భూములు ఉన్నట్లు తేలగా, ఇందులో పట్టా, ప్రభుత్వ భూముల ప్రాతిపదికన రానున్న రోజుల్లో లీజ్ ఫార్మింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

బ్లాక్‌‌ రైస్‌‌ వేసిన

ఐదేండ్ల కిందట గవర్నమెంట్‌‌ జాబ్‌‌ వదులుకొని లీజ్‌‌ ఫార్మింగ్‌‌ మొదలుపెట్టా. ముందు కూరగాయలు పండించా.  ఇప్పుడు తెలంగాణ సోనా, షుగర్‌‌ పేషెంట్లకు ఉపయోగపడే బ్లాక్‌‌ రైస్‌‌, రెడ్‌‌ నవారా రకం సాగు చేశా. సాధారణ పంటలతో పోల్చితే దిగుబడి తక్కువగా ఉన్నా డిమాండ్ బాగా ఉండటంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. సిటీలో హైటెక్ సిటీ, కూకట్‌‌పల్లి, ఆల్వాల్, తార్నాక లాంటి రెసిడెన్షియల్ ఏరియాల్లో డోర్ డెలివరీ చేస్తాను. మే నాటికి 50 ఎకరాల్లో లీజ్ ఫార్మింగ్ చేసే ప్లాన్ లో ఉన్నా. నాకంటూ సొంత ల్యాండ్ లేకున్నా ‘ప్రాచీన’ పేరిట ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్‌‌ చేసుకున్నా.

– విజయ్, లీజ్ ఫార్మర్

పడావు పెట్టలేక లీజుకిచ్చిన
నాన్న చనిపోవడంతో వ్యవసాయం చేసేటోళ్లు లేకుండా పోయారు. పడావు పడ్డ భూములను చూసిన ప్రతిసారి బాధ అనిపించేది. ఓ వ్యక్తి వచ్చి 8 ఎకరాల భూమిని లీజుకు అడిగారు. ఫస్ట్ ఆలోచించాను. కానీ భూమి సాగులోకి వస్తుందని సంతోషంగా ఒప్పుకున్నా. ప్రతి ఏడాది బీడు భూములపై లీజ్ రూపంలో ఆదాయం వస్తోంది.
– సుధాకర్ రెడ్డి, రైతు కీసర

కన్సల్టెంట్గా సేవలందిస్తున్నా
ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచాలనే ఉద్దేశంతో 20 ఏళ్లుగా వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, అవగాహన కల్పిస్తున్నా. లీజ్ ఫార్మింగ్ పై జనాల్లో ఆసక్తి పెరుగుతోందని భావించి, అగ్రి ఫార్మ్స్ కన్సల్టెన్సీ నడిపిస్తున్నా. ఆదాయం వస్తుండటంతో చాలా మంది తమ బీడు భూములు, చెలకలను లీజుకిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. రెండు నెలలకోసారి నేనే 10 నుంచి 25 ఎకరాల్లో ఒప్పందం చేయిస్తుంటా. చాలా వరకు చిన్న మొత్తంలో భూములను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు.
– ఉదయ్, ఫార్మ్ ల్యాండ్ కన్సల్టెంట్, మొమీన్ పేట్

For More News..

రాష్ట్ర చరిత్రలో ఫస్ట్​ టైమ్.. ఒక్క నెలలోనే 850 కోట్ల ఇన్‌కం

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంచిన బోర్డు

కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం

దవాఖాన్లకే మస్తు పైసల్.. 18 వేల జీతంలో 4 వేలు ఆస్పత్రికే